ఆది దంపతులు అని ఎందుకు అంటారు?

శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. అయితే, ఆ జంగమయ్యను చేరాక ఆమె అంతకాలం అనుభవించిన భోగమంతా మటుమాయమైంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ.. అంటూ ఊరంతా తిరుగుతూ, వల్లకాడులో సంసారం నడపమంటాడాయన. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా పల్లెత్తుమాటయినా అనదామె. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పతిదేవుడు ఈ పనిచేశాడని అర్థం చేసుకోగలిగింది.
*శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను కాదన్నదీ లేదు. తనకు దేనిమీదా అనురక్తిగానీ, ఆశలు కానీ లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట. బాట. అతగాడు జడలు కట్టిన కేశాలతో… తోలుదుస్తులతో, కాలసర్పమే కంఠాభరణంగా తిరుగాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే, ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆదిదంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.
*ఇన్ని నియమాలెందుకు?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో మాత్రమే కావు. ప్రతి పండుగ వెనుకా వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్‌ కిరణాలను, విద్యుత్‌ అయస్కాంత్‌ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్‌ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి ఈ నియమాలు.
*అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సున కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు.శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
*జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ… జాగరణ అవదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
*మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. నమకం, చమకం చదువుకోవాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా చేయించుకోవాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, శివనామస్మరణ అనేక పాపాలను ప్రక్షాళన చేస్తుంది.

1. వెయ్యి కళ్లూ చాలవులే..!
సనాతన ధర్మాలు విరాజిల్లిన కర్ణాటకలోని మూడబిద్రిలో వెయ్యి స్తంభాల జైనదేవాలయం అనేక విశేషాలకు ఆలవాలం.రేవు నగరిగా గుర్తింపుపొందిన మంగళూరుకు 36 కిలోమీటర్లదూరంలో ఉన్న మూడబిద్రి పట్టణానికి దేవాలయాల పట్టణంగా పేరు. ఇక్కడ అనేక జైన, హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత విశాలమైన వేయి రాతి స్తంభాల చంద్రనాథ తీర్థంకరుడి బసది చాలా ప్రాచీనమైంది. కన్నడభాషలో జైన దేవాలయాలను బసదులు అంటారు.కన్నడంలో తూర్పు దిక్కును మూడ అని అంటారు. బిద్రి అంటే వెదురు అని అర్థం. ఈ ఊరికి తూర్పు వైపు వెదురు ఎక్కువగా ఉండేది అందుకే మూడబిద్రి అనే పేరు వచ్చింది. ఈపట్టణం 18 అంకెతో ముడిపడి ఉండడం మరో విశేషం. ఇక్కడినుంచి 18 ప్రాంతాలకు వెళ్లడానికి విశాలమైన రహదారులున్నాయి. అలాగే 18 హిందూ దేవాలయాలు, 18 జైన దేవాలయాలు, 18 చెరువులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది జైన ధర్మ వాస్తు కళాకౌశలంతో నిర్మించిన 1000 స్తంభాల జైన దేవాలయం దీన్ని 1443లో నిర్మించారని… 1662లో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని దేవరాజవడయార్‌ పునురుద్ధరించారని చెబుతారు. అలాగే కార్కళ ప్రాంతానికి చెందిన భైరవరాణి నాగలాదేవి ఈ దేవస్థానం ముందు 60 అడుగుల సుందర ధ్వజస్తంభాన్ని నిర్మించారు. గర్భగుడిలో ఎనిమిది అడుగుల చంద్రనాథ తీర్థంకరుడి కాంస్యవిగ్రహం ఉంటుంది. ఈ బసది ఏడుభాగాలుగా ఉంటుంది. చతురశ్ర, గర్భగుడి, శుఖనాశి, తీర్ధంకరమంటపం, గడ్డిగే మంటపం, చిత్రాదేవి మంటపం, భైరవదేవి మంటపాలున్నాయి. మరో విశేషమేమిటంటే ఇక్కడున్న వెయ్యి స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేకుండా భిన్న కళాకౌశలంతో కనిపిస్తాయి. వీటిలోని అనేక కుడ్య చిత్రాలు ప్రకృతికి, మనిషికి ఉన్న అనుబంధానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ప్రథమ తీర్ధంకరుడైన ఆదినాథుడి నుంచి చివరి తీర్ధంకరుడైన వర్ధమానమహావీరుడి వరుకు 24మంది తీర్ధంకరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. అందుకే దీన్ని త్రిభువన తిలక చూడామణి అనికూడా అంటారు.
2. ఆచితూచి ఉండాలి..-ఏప్రిల్‌ 3న షబే మేరాజ్‌
ముహమ్మద్‌ ప్రవక్త (స) సప్త ఆకాశాలను దాటి వెళ్లిన రాత్రి.. అల్లాహ్‌తో స్వయంగా మాట్లాడిన అద్వితీయ ఘడియలను షబే మేరాజ్‌ అని పిలుస్తారు. నమాజ్‌ కానుకగా లభించిన అద్భుతమైన రాత్రిగా దీనిని భావిస్తారు. పాపాలు చేసిన వారికి నరక శిక్షలు ఎలా ఉంటాయో తెలిసిన రోజు కూడా ఇదే అని అంటారు. ఖురాన్‌లో ప్రస్తావించిన పరలోక జీవితం, స్వర్గ నరకాల గురించి ప్రవక్త (స)కు ప్రత్యక్షంగా చూపాడు అల్లాహ్‌. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోజును ముస్లిం సోదరులు పర్వదినంగా భావిస్తారు. షబ్‌ అంటే రాత్రి అనీ, మేరాజ్‌ అంటే నిచ్చెన అని అర్థం. ఈ రోజున ముస్లింలు అదనపు నమాజులు నిర్వహిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. షబే మేరాజ్‌ సందర్భంగా ముహమ్మద్‌ ప్రవక్తకు అల్లాహ్‌ అందించిన ఆదేశాలు సమస్త మానవాళికీ మార్గదర్శకాలు.
* తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలి.
* బంధువులు, పేదవారు, బాటసారుల అవసరాలు తీర్చాలి.
* వృథాగా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు.
* పేదరికానికి భయపడి కట్టుకున్నవారినీ, సంతానాన్ని విస్మరించకండి. హత్యలకు పాల్పడటం అతి పెద్ద నేరం.
* వ్యభిచారం దుష్టకార్యం.. ఆ దరిదాపులకు కూడా వెళ్లొద్దు.
* అనాథల సొమ్ము జోలికి పోవద్దు.
* ఇచ్చిన మాట నెరవేర్చండి. వాగ్దానం విషయంలో సమాధానం చెప్పవలసి ఉంటుందని గుర్తించండి.
* వస్తువులను కొలపాత్రతో ఇస్తే.. పూర్తిగా నింపి ఇవ్వాలి. తూచి ఇస్తున్నట్లయితే.. సరైన తరాజు ఉపయోగించాలి.
* తెలియని విషయం వెంట పడకండి. అందని దానికి అర్రులు చాచడం వల్ల కళ్లు, చెవులు, మనసు అన్ని విషయాల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ విషయాలు గుర్తెరిగి నడుచుకున్న వాళ్లు అంతిమ తీర్పు రోజున విశ్వాసిగా గుర్తింపు పొందుతాడని ప్రభువు సెలవిచ్చాడు. ఇహంలో అహాన్ని ప్రదర్శించిన వాళ్లు.. పరంలో కష్టాల పాలవ్వడం ఖాయమని హెచ్చరించాడు.
3. కొలువుదీరిన త్రిశక్తి
నైమిశారణ్యం భారత భాగవతాది పురాణాల రచనకు వేదికైన పుణ్యభూమి శౌనకాది మహారుషులు తపమాచరించిన తపోభూమి అనేక పుణ్యతీర్దాల నెలవు. ఉత్తరప్రదేశ్ రాష్రం లోని కొలువై ఉన్న ఈ క్షెత్రంలో మహత్తర నిర్మాణాన్ని పూర్తీ చేశారు. ఓ తెలుగు వ్యక్తీ. 42 అడుగుల మహావిష్ణువు, 42 అడుగుల విశ్వజనీ అమ్మవారు ఇంకా 27 ఆలయాలున్న ఓ ఆలయ సముదాయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంకి చెందిన గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి ఆద్వర్యంలో నైమిశారణ్యం నిర్మించారు. ఇప్పటికే వీరంపలెంలో బాలత్రిపురసుందరీ పీటాన్ని నిర్మించారాయణ. పద్దెనిమిది శక్తిమాతలను ప్రతిష్టించి అత్యద్భుత త్రిశక్తి దామాన్ని ఏర్పాటు చేయాలన్నది వెంకటరమణ శాస్త్రి సంకల్పం. దీనికోసం ఎన్నో ప్రాంతాలు తిరిగిన తర్వాత లక్నోకు 110 కిమీ దూరంలో ఉన్న నైమిశారన్యాన్ని ఎంచుకున్నారు. అక్కడ నదీ తీరంలో ఎకరన్నరం స్థలంలో ఎంతో శ్రమతో అద్భుత ఆలయ ప్రమ్గానాన్ని సాకారం చేశారు. నిర్మాణం కోసం జైపూర్ నుంచి పాలరాతి విగ్రహాలు.. మహాబలిపురం నుంచి రాతి విగ్రహాలు తెప్పించారు. శిల్పులను తమిళనాడు నుంచి, కార్మికులను విశాఖపట్నం నుంచి, టైల్స్‌ వేసేవారిని బిహార్‌ నుంచి రప్పించారు. రెండున్నర సంవత్సరాలు అహోరాత్రాలు శ్రమించారు. త్రిశక్తిధామంలో గణపతిధామం, 42 అడుగుల విశ్వజనని అమ్మవారు, 42 అడుగుల శ్రీమన్నారాయణుడి విగ్రహాలు, దశమహావిద్య ఆలయాలు, సప్తమాతృకలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఆలయాలు ఉంటాయి.
* మంచి భోజనం, చక్కని వసతి దొరికేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తుల కోసం 50 గదులను నిర్మించారు. ఇక్కడకు వచ్చిన వారు ఏడు రోజులు ఇక్కడ ఉండడం ఆనవాయితీ. దానికి తగ్గట్లు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల ప్రవచనాల కోసం ఒక ప్రత్యేక సముదాయం నిర్మించారు. 500 మంది ఒకేసారి భోజనం చేసేందుకు భోజనశాల, రెండు పాకశాలలు.. శాశ్వత యజ్ఞశాల నిర్మిస్తున్నారు. మార్చి 17వ తేదీన ఆలయాల ప్రతిష్ఠ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)