అమెరికాలో…పెనమలూరు అమ్మాయిని మోసం చేసిన గోదావరి అబ్బాయి

మాక్కాబోయే అల్లుడు అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీరు.. లక్షల్లో జీతం.. బోల్డంత ఆస్తి కూడా ఉందండి.. పైగా పైసా కట్నం అక్కర లేదంటున్నారు.. నిజంగా మా అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో కదండి.. అంటూ పక్కింటి కామాక్షమ్మ గారికి అడక్కుండానే అన్నీ చెప్పేస్తుంది ఓ మధ్యతరగతి ఇల్లాలు. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవనీయట్లేదు ప్రస్తుత సంబంధాలు. అడిగినంత కట్నం ఇవ్వలేదనో.. కట్టుకున్న భార్య పట్ల మోజు తీరిపోయిందనో అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారు భర్తతో పాటు అత్తమామలు.కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన సంధ్యారాణికి, అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భీమవరానికి చెందిన ధన్‌రాజ్‌తో 2017లో వివాహం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద రూ.22 లక్షల నగదు, ప్లాటు, 30 తులాల బంగారం సమర్పించుకున్నారు అల్లుడుగారికి. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను ఇక్కడే ఉంచి అమెరికా వెళ్లిపోయాడు భర్త.వీసా పనులు పూర్తవ్వగానే వచ్చి తీసుకువెళతానని చెప్పాడు. అత్తారింట్లోనే ఉంటూ భర్త పిలుపుకై ఎదురుచూస్తోంది సంధ్యారాణి.అత్తగారి చేతిలో పోసిన రూ.22 లక్షల క్యాష్ సరిపోయినట్లు లేదు.. మీ నాన్న నీకిచ్చిన స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మంటూ అత్తామామ వేధించడం మొదలు పెట్టారు కోడలిని. వారి వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన దగ్గరనుంచి సంధ్యకు భర్తనుంచి ఫోన్ రాలేదు. వీసా గురించిన విషయాలేమీ తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చిన సంధ్య అమెరికాలో ఉంటున్న తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి భర్త గురించి ఎంక్వైరీ చేయమంది. ధనరాజ్ అమెరికాలో కృష్ణావతారం ఎత్తినట్లు తెలుసుకుంది. తన భర్త అక్కడ ఇద్దరు మహిళలతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది సంధ్యకి. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి భర్త, అత్తమామలపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)