పూసపాటి వారి అమ్మాయి గెలుస్తుందా?

ఈ ఎన్నికల్లో పూసపాటి గజపతుల వంశం నుంచి మూడో తరం రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది. విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి.. అసెంబ్లీ స్థానానికి బరిలో దిగారు. ప్రత్యర్థిగా వైకాపా తరఫున ఎప్పట్లాగే పట్టు వదలని విక్రమార్కుడిలా కోలగట్ల వీరభద్రస్వామే పోటీకి దిగారు. ఆయన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెదేపాకు ప్రత్యర్థిగా పోటీ చేయడం వరసగా ఇది ఏడోసారి! 2004లో ఒక్కసారి మాత్రమే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అశోక్‌పై విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాలుగు సార్లు, వైకాపా అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయారు. 300 ఏళ్లకు పైబడిన చరిత్ర విజయనగరం సామ్రాజ్యం సొంతం. కళలకు కాణాచి. వందేళ్లకు పూర్వమే దక్షిణ భారతంలో విద్యల నగరంగా భాసిల్లింది. స్వాతంత్య్రానంతరం పూసపాటి వంశీయులకు పెట్టని కోటగా ఉన్న ఈ స్థానం ఆది నుంచీ తెదేపాకు కంచుకోటగా నిలుస్తోంది. విజయనగరం అసెంబ్లీకి 1952 నుంచి ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరగగా.. పూసపాటి వంశీయులు 11 ఎన్నికల్లో పాలు పంచుకుని పదిసార్లు విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు 1978లో జనతా పార్టీ తరఫున, అనంతరం 1983, 85, 89, 94, 1999, 2009 ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో అదే స్థానం నుంచి ప్రస్తుతం అశోక్‌గజపతి కుమార్తె అదితి బరిలోకి దిగారు. 2014లో అశోక్‌గజపతిరాజు విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి 1,06,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ లోక్‌సభ పరిధిలోనే ఉన్న విజయనగరం అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీతకు వచ్చిన మెజారిటీ 15,404 ఓట్లు. అదే అసెంబ్లీ పరిధిలో అశోక్‌కి 42,624 ఓట్ల ఆధిక్యత రావటం చూస్తే ఈ ప్రాంతంపై గజపతులకు ఉన్న పట్టు ఎంతో తేలికగానే అర్థమవుతుంది. అశోక్‌ ఇప్పుడు మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అదితి గజపతిరాజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ సైకాలజీ పూర్తిచేశారు. విద్యారంగంపై ఉన్న ఆసక్తితో కొంతకాలం చెన్నై, దుబాయిలలోని మాంటిస్సోరీ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. రెండేళ్లుగా కుటుంబ వారసత్వంగా వచ్చిన మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. మాన్సాస్‌ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో తండ్రి అశోక్‌ తరఫున ప్రచారం చెయ్యటంతో పాటు ఏడాదిన్నరగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నారు.

*****అదితి బలబలాలు
* పూసపాటి వంశీయుల ఆడబిడ్డ అరంగేట్రం
* అశోక్‌గజపతిపై ఉన్న ప్రజాభిమానం, ఆయన చేసిన అభివృద్ధి
* నియోజకవర్గంలో మహిళా ఓట్లు ఎక్కువగా ఉండటం
* తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె సహకారంపై అనుమానాలు

*****కోలగట్ల బలాబలాలు
* మాస్‌ లీడర్‌గా పేరుండటం
* నెలల క్రితమే టికెట్‌ ప్రకటించడంతో అప్పట్నుంచి ప్రచారం
* కుల సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడం
* బొత్స సత్యనారాయణ, ఇతర సీనియర్‌ నేతల సహకారంపై అనుమానాలు
* ఇదే స్థానంలో గతంలో ఐదుసార్లు ఓటమి పాలవటం
* అనుచరుల దుందుడుకు వైఖరిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com