వైకాపాపై ఈసీకి కేఏ పాల్ ఫిర్యాదు–రాజకీయ-03/28

*వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఏపీ సీఈవో ద్వివేదిని కలిసిన పాల్ తన పార్టీ కండువాను వైసీపీ కాపీ కొట్టిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2008లో తమ పార్టీని రిజిస్టర్ చేయించామని, కానీ 2011లో తమ జెండాను జగన్ మోహన్ రెడ్డి కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. అలాగే ఓటు బ్యాంకును చీల్చాలని తమ అభ్యర్థుల పేర్లతో సరిపోలిన అభ్యర్థులను వైసీపీ పోటికి నిలబెట్టిందని పాల్ అన్నారు. ఈ నెల 24న తమ పార్టీ బి-ఫామ్‌లు, స్టాంపులను వైసీపీ దొంగలించిందని ఆయన ఆరోపించారు. తనను అడుగడునా వైసీపీ అడ్డుకుంటోందని.. నర్సాపురంలో తాను నామినేషన్ వేసే సమయంలో జగన్ అనుచరులు తనను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు.
* రసవత్తరంగా మరీనా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక
నిజామాబాద్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. రైతు సమస్యలు ఎలివేట్ చేయాలనే ఉద్దేశ్యంతో దాదాపు 189 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు ఒకే కావడంతో ఇప్పుడు బ్యాలెట్ పోరు తప్పనిసరి అయ్యేలా కనిపిస్తోంది. భారీగా నామినేషన్లు దాఖాలు కావడంతో ఆన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఎవరి మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. లోకల్ గవర్నమెంటు మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారా? లేక కేంద్ర పై కోపంతో ఈ నామినేషన్లు వేశారా? అనే విశాయం పై చర్చాప చర్చలు జరుగుతున్నాయి. రైతులు నమినేశాన్లతో ఎవరి ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. తెలంగాణలోని పదహారు సీట్లు గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ పని చేస్తోంది. వందకు వంద శాతం గెలిచే సీట్లలో నిజామాబాద్ ఒకటి. సీటు గ్యారెంటీ అనే ధీమాతో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోంది. భాజపా పై కోపంతోనే రైతులు నామినేషన్లు వేశారని ప్రజల్లోకి బలంగా తీసుకేల్తోంది టీఆర్ఎస్. మరోవైపు కవితకు పోటీగా ఉన్న ప్రత్యర్ధులు మధూయష్కి అరవింద్ కూడా పోటీల్లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఇద్దరు ప్రత్యర్ధులు కూడా పోటీపై ఆసక్తి లేదు. పార్టీ బలవంతం మీద పోటీ చేస్తుండటంతో టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదనేది గులాబీ నేతల వాదన.
* జర్నలిస్టులకు ఫేస్ బుక్ ద్వారా క్షమాపణ చెప్పిన బాలయ్య.
హిందూపురం నియోజకవర్గంలో బుధ‌వారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ జ‌ర్న‌లిస్టుల‌పై మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌చారానికి చిన్న పిల్ల‌లు అడ్డుగా వ‌స్తుండ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆ పిల్లలను పక్కకు లాగి ప‌డేశారు. ఈ దృశ్యాల‌ను వీడియో తీసిన రిపోర్ట‌ర్ పై తిట్ల దండ‌కం మొద‌లుపెట్టి, ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా బాల‌య్య‌ హెచ్చ‌రించారు.అంతే కాదు “మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా” అంటూ.. కొన్ని భారీ డైలాగులను కూడా వ‌దిలారు.ఆ తర్వాత ఈ ఘటనపై ఫేస్‌బుక్‌లో స్పందించిన ఆయ‌న… అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని , అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని అన్నారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుడిగా పోటీ చేయ‌బోతున్న బాల‌య్య న‌టించిన రాజ‌కీయ నేప‌థ్య సినిమా “లెజెండ్” నేటితో 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది.
* సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య వివాదం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. 20 స్థానాల్లో ఆర్జేడీ.. 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుందని ప్రకటించారు. కానీ తాజాగా రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయంలో వివాదం నెలకొంది. ఆర్జేడీకి అన్యాయం జరిగిందని ఆ పార్టీ సీనియర్‌ నేత రామ్‌దేవ్‌ రాయ్‌ పార్టీ అధినాయకత్వానికి తెలియజేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఆర్జేడీని బలహీనపరిచే విధంగా సీట్ల సర్దుబాటు ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.
* పదవి పోతుందని మోదీకి భయం- రాహుల్‌
పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం అన్నారు. ‘మిషన్‌ శక్తి’పై మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆ విషయం స్పష్టంగా తెలిసిందని రాహుల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ విభాగంతో రాహుల్‌ సమావేశమయ్యారు.
*డిల్లి ఎన్నికల్లో హాట్ టాపిక్
ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేసే ఓ అంశం నేడు ప్రచారాస్త్రమైంది. అక్రమ వాణిజ్య సంస్థలు, దుకాణాలను మూసువేయడం కోసం కొనసాగుతున్న ‘స్పెషల్‌ డ్రైవ్‌’ అది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొదటి డ్రైవ్‌ 2006లోనే ప్రారంభంకాగా, తాజా డ్రైవ్‌ 2017, డిసెంబర్‌ నెలలో ప్రారంభమైంది. దీని క్రింద 2019, జనవరి 31వ తేదీ నాటికి ఢిల్లీ నగరంలో 10,533 షాపులను మూసివేశారు.
*వైఎస్సార్‌సీపీలో చేరిన రచయిత చిన్ని కృష్ణ
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఓ వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. పార్టీలో చేరడానికి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణతోపాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్‌లకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
*చిన్నపిల్లాడు ఏదో అన్నాడు.. దానిపై నేను కామెంట్ చేయను- మమతా బెనర్జీ
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చిన్నపిల్లాడితో పోల్చడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల గురించి మీరేమంటారు? అంటూ మమతా బెనర్జీని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. చిన్నపిల్లాడు ఏదో అన్నాడు, దానిపై నేను కామెంట్ చేయను అన్నారు.
*భీమ‌వ‌రం నుండి ప‌వ‌న్‌పై పోటీ చేస్తాన‌న్న వ‌ర్మ‌
రామ్ గోపాల్ వ‌ర్మ వ్య‌వ‌హారం చూస్తుంటే ఆయ‌న డేలో స‌గం క‌న్నా ఎక్కువ స‌మ‌యం సోష‌ల్ మీడియాలోనే గడుపుతారేమోన‌ని అనిపిస్తుంది. ట్విట్ట‌ర్‌లో ఏదో ర‌క‌మైన పోస్ట్‌లు పెడుతూ జ‌నాల అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకుంటారు వ‌ర్మ‌. తాను తెరకెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి కావల‌సినంత ప్ర‌మోష‌న్‌ని ట్విట్ట‌ర్ ద్వారానే చేసుకున్నాడు. అయితే కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న‌ భీమ‌వ‌రం నుండి తాను పోటీ చేస్తున్నానని షాకింగ్ విష‌యం చెప్పాడు. నామినేష‌న్ గ‌డువు ముగియ‌డంతో తనకు పై స్థాయి నుంచి పోటి చేసేందుకు పర్మిషన్‌ వచ్చిందని, పూర్తి వివరాల కోసం వేచి ఉం‍డాలంటూ ట్వీట్ చేశాడు వర్మ. దీంతో ఒక్క‌సారిగా అంద‌రు ఏం జ‌రుగుతుందోనని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికి ఇది కేవలం ఒక అడ్వాన్స్‌ ఏప్రిల్ ఏప్రిల్ ఫూల్ జోక్. నాకు తెలిసి దీనిని ఎవ్వ‌రు న‌మ్మి ఉండ‌రు అని ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.
*భాజపా 273 హెలికాప్టర్లు వాడుతోంది :కుటుంబరావు
హెలికాఫ్టర్‌ ద్వారా సీఎం డబ్బు తరలిస్తున్నారని భాజపా నాయకులు ఆరోపణలు చేయడంలో నిజం లేదని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. భాజపా ఇలాంటి పనులు చేస్తోంది కాబట్టే వారికి ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా భాజపా 273 హెలికాఫ్టర్లు వాడుతున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిలో గురువారం కుటుంబరావు విలేకరులతో మాట్లాడారు.
*కేసీఆర్ స్పందించడం ఓ డ్రామా – రేవూరి
శరత్ అనే రైతు సమస్యకు సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో స్పందించడం ఓ డ్రామా అని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఓట్లు దండుకోవడం కోసమే కేసీఆర్ ఆ డ్రామా ఆడారాని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది రైతులు భూ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అలాంటి రైతుల సమస్యలను కూడా ఇంతే వేగంగా కేసీఆర్ పరిష్కరిస్తారా అని రేవూరి ప్రశ్నించారు.
*ఇరుకు సందుల్లో సభలు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు – బుద్దా వెంకన్న
ఇరుకు సందుల్లో సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఆయన సభలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరిమర్శించలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అయితే సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని జగన్‌కి సవాల్ విసిరారు. తప్పులన్నీ చేసి తప్పేంటి అని జగన్ అంటున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
*యువత రాజకీయాల్లోకి రావాలి -లోకేశ్‌
అంకుర సంస్థల స్థాపనపై యువత దృష్టి సారించాలని మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని చెప్పారు. 2019 ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకం కానున్నాయని అన్నారు. విశాఖపట్నంలో విద్యార్థులతో మంత్రి లోకేశ్‌, తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌తో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యా రంగంలో ఉన్న సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు వంటి కీలక అంశాలపై విద్యార్థులతో చర్చించారు. ప్రతి సమస్యకు ప్రభుత్వ పరంగా తీసుకున్న, తీసుకోనున్న చర్యలను వివరించారు.
*తెలంగాణ నిధులతో ఎమ్మెల్యేల కొనుగోలు -భట్టి
రాహుల్‌ సభకు కార్యకర్తలు, ప్రజలంతా భారీగా తరలిరావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. 16 లోక్‌సభ సీట్లతో కేసీఆర్‌ దేశాన్ని ఎలా ఏలుతారని ప్రశ్నించారు. ఇవి మోదీకి మద్దతు ఇచ్చేందుకేనని, ఫలితంగా రాష్ట్రంలో అవినీతి కార్యకలాపాలను కేసీఆర్‌ కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు. తెలంగాణ నిధులు సరిగ్గా ఉపయోగించకుండా వాటితో శాసన సభ్యులను కొనేందుకు కేసీఆర్‌ దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణ కోసం తెచ్చుకుంటోన్న నిధుల్ని అభివృద్ధికే వినియోగించుకుందామని పేర్కొన్నారు
*ముద్దాయి ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించడమేంటి?- వర్ల
కడప ఎస్పీని ఎందుకు బదిలీ చేశారు? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదుపై ఈసీ ఎందుకు స్పందించింది? అని అడిగారు. విజయసాయి, జీవీఎల్‌ ఫిర్యాదులు ఈసీకి శిరోధార్యమా?, ఇంటెలిజెన్స్‌ డీజీని ఎలా బదిలీ చేస్తారు? అని నిలదీశారు. విజయసాయి వ్యాఖ్యలపై ఈసీ సమాధానం చెప్పాలన్నారు. ఈసీ మోదీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. అందరూ కలిసి టీడీపీపై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
*1న తెలంగాణకు రాహుల్‌ రాక
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడి కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఒకటిన జహీరాబాద్‌, నాగర్‌కర్నూలు, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నట్లు పీసీసీ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్‌ బహిరంగసభ, 2 గంటలకు నాగర్‌కర్నూలు సెగ్మెంట్‌ వనపర్తిలో, సాయంత్రం 4 గంటలకు నల్గొండ లోక్‌సభ స్థానం పరిధి హుజూర్‌నగర్‌ ఎన్నికల సభలలో రాహుల్‌ పాల్గొననున్నారు.
*కాంగ్రెస్‌కు మరో దెబ్బ
ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఎన్నికైన ఆనందం కాంగ్రెస్‌కు ఎంతో సేవు నిలవలేదు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి, తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం అధివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాజుల వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఒంటెత్తు పోకడలతో ప్రజలకు దూరమయిందని, అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని చెప్పారు. అవసరమయితే కాంగ్రెస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి, తిరిగి తెరాస తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
*హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ చెవిలో చెప్పారా?
‘ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ అంటే మీకెందుకు అభ్యంతరమని జగన్‌ అంటున్నారు. హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ మీ చెవిలో చెప్పారా? ఏపీకి ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. ఆంధ్రాకు ఇస్తే మాకూ ఇవ్వాలని అన్నారు. జగన్‌ ఎవరి చెవిలో పూలు పెడతారు. సోనియా హైదరాబాద్‌లో సభకు వచ్చినప్పుడు ఏపీకి హోదా ఇస్తామని ప్రకటించారు’ అని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం రాత్రి అనంతపురంలో రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ‘మోదీ, కేసీఆర్‌ రాష్ట్రానికి విరోధులుగా మారారు. వీరికి జగన్‌ మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏడాదికి రూ.350 కోట్లు ఇవ్వాలి. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు ఇస్తున్నారు.
*అప్పుడు మాతో పొత్తుకెందుకు తహతహలాడారు?
తమ పార్టీపై విమర్శలు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణలో డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమతో పొత్తుకు తహతహలాడడం తనకు విస్మయం కలిగించిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించారు. కేసీఆర్‌తో కలవడం తప్పా? అని జగన్‌ చేసిన వ్యాఖ్యలను బాబు తన ట్విటర్‌లో తప్పుబట్టారు. తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై కేటీఆర్‌ ట్విటర్‌లో బదులిచ్చారు. ఇప్పుడు ఇంతగా విమర్శిస్తున్న బాబు అప్పట్లో తమతో పొత్తుకు తీవ్రంగా యత్నించిన విషయాన్ని గుర్తుచేశారు.
*దేశ దిశానిర్దేశ బాధ్యత కేసీఆర్‌కు
తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘‘పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్‌కు సంబంధంలేనివని కాంగ్రెస్‌, భాజపా పక్షాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో 16మంది తెరాస ఎంపీలు గెలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి మరో 150మందిని జోడించి కేంద్రంలో బలమైన కూటమిని నెలకొల్పుతారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ అంటే ఇష్టంలేని ప్రాంతీయ పార్టీలు 10-15 ఉన్నాయి. ప్రాంతీయపార్టీలన్నీ కలిసి అవసరమైతే దేశానికి దిశానిర్దేశం చేసే ముఖ్య బాధ్యతను కేసీఆర్‌కు అప్పగించాల్సిన అవసరముంది.
*భాజపాలో చేరిన జితేందర్‌రెడ్డి
తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి భాజపాలో చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం దిల్లీలో జితేందర్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరడంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కీలకపాత్ర పోషించారు.భాజపాలో చేరడం మాతృసంస్థలోకి వచ్చినట్లుందని జితేందర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదో తెరాస నాయకత్వమే చెప్పాలన్నారు. పదవులు ఆశించో, హామీలు తీసుకునో భాజపాలో చేరడం లేదన్నారు.
*బాబు మళ్లీ వస్తే సంక్షేమానికి కోత
పొరపాటున చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటిలోనూ కోత విధిస్తారు. పింఛన్లు తీసేస్తారు. రేషన్‌ కార్డులు కోసేస్తారు. అయిదేళ్ల పాలన చూశాం. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పెట్రో ధరల భారం మోపారు. అన్నింటా బాదుడేబాదుడు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే బాదుడు కాదు.. వీరబాదుడే ఉంటుంది..’ అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం విశాఖ జిల్లా పాయకరావుపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, మండపేటలలో ప్రచార సభలలో ఆయన మాట్లాడారు.
*నేను యాక్టరైతే ఆయనేమిటి?
‘ప్రతిపక్ష నాయకుడు జగన్‌ నా పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు. చంద్రబాబు భాగస్వామి అని, యాక్టర్‌ అని పిలుస్తున్నారు. సినిమాల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన నన్ను యాక్టర్‌ అని పిలిస్తే, రెండేళ్లు జైల్లో ఉండి వచ్చిన జగన్‌ను ఏమని పిలవాలి?’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘మీరేమైనా మహాత్మాగాంధీలా పోరాడి జైలుకు వెళ్లారా? ప్రజాధనం అడ్డంగా దోచుకుని వెళ్లారు. నేను చంద్రబాబు భాగస్వామినైతే.. మీరు భాజపా, అమిత్‌షాలకు భాగస్వామా?’ అని నిలదీశారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఒంగోలులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘నేను ఈసారి తెదేపాతో పొత్తు పెట్టుకుంటే ధైర్యంగా పెట్టుకుంటాను. ఎవరు అడ్డుకుంటారు? మీలా దొడ్డిదారిన వెళ్లను. ఈ ఎన్నికల కోసం వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా. ఈ విషయం స్పష్టంగా చెప్పా. నాలాగా జగన్‌ బహిరంగంగా చెప్పగలరా? తెరాస, భాజపాతో పొత్తు పెట్టుకున్నానని. డొంకతిరుగుడు ఎందుకు?’ అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా విఫలమైన జగన్‌ ముఖ్యమంత్రి అయి ఏం చేస్తారని ప్రశ్నించారు.
*ఎన్నికలకు ముందే విలీనం!
పార్లమెంటు ఎన్నికలలోపే కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు తెరాస అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. తద్వారా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీయవచ్చని, సునాయాస విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ విపక్ష హోదాను కోల్పోయేలా చేయడం కూడా ఆ పార్టీ ప్రణాళికగా ఉంది. ఇప్పటికే పది మంది గులాబీ గూటికి చేరేందుకు ముందుకొచ్చారు. మరో నలుగురిని సమీకరించి, లక్ష్యాన్ని సాధించాలని అధికార పార్టీ భావిస్తోంది.
*కాంగ్రెస్‌ చెల్లని రూపాయి
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి చెల్లని రూపాయిగా మారింది.. భాజపాకు ఓటర్లే లేరు.. కేసీఆర్‌ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో తెరాస తిరుగులేని విజయం సాధించటం ఖాయం’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, నంగునూరులో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. ఇక్కడ చేపట్టిన పథకాలపై ప్రజల్లో సానుకూలతను చూసి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీటినే అనుసరిస్తున్నారన్నారు.
*తెలంగాణలో తెదేపా శకం ముగిసింది
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసిందని, ప్రజలంతా తెరాసకే సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన తెదేపా సీనియర్‌ నేత, శాసనసభ ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కూన వెంకటేశ్‌గౌడ్‌ బుధవారం కేటీఆర్‌ సమక్షంలో తన అనుచరులు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తెదేపా నేతలతో కలిసి తెరాసలో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
*రాజకీయ లబ్ధికే ప్రధాని ప్రకటన
శాస్త్రవేత్తలు సాధించిన విజయంపై ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ‘మిషన్‌ శక్తి’ని విజయవంతం చేసిన డీఆర్‌డీఓను, శాస్త్రవేత్తలకు పార్టీలకతీతంగా అందరు నాయకులు అభినందనలు తెలపడంతో పాటు మోదీని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ప్రత్యేకంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారని విమర్శించారు. ప్రధాని ప్రకటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈసీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. ఎశాట్‌’ క్షిపణిని యూపీఏ ప్రభుత్వ సమయంలోనే సిద్ధం చేశామని, ఆ ప్రయోగంతో ఇతర దేశాల ఉపగ్రహాలకు హాని కలుగుతుందనే పరీక్షించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు.
*పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా
పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ వెల్లడించారు. వ్యక్తిగతంగా మాత్రం పార్టీకి సేవలు అందించాలన్నదే తన అభిలాషని, సంస్థాపరంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె అమేఠి, రాయబరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని ప్రియాంకా గాంధీ వెల్లడించారు.
*55% తెలంగాణ ప్రజల మద్దతు మోదీకే: కిషన్‌రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆదరణ తగ్గుతోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి చెందడమే దానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 55% ప్రజలు మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. అందుకే తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు భయం పట్టుకుని భాజపాపై నోరు పారేసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నవారంతా భాజపా అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని.. ప్రాంతీయ పార్టీలకు వేస్తే అది బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయడానికే ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*గోవాలో అర్ధరాత్రి అనూహ్య రాజకీయం
గోవాలో అర్ధరాత్రి అనూహ్యమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయి. 2012 నుంచి మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం కావడం, దరిమిలా ఆ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చకాచకా జరిగిపోయాయి. ఈ చర్యతో మొత్తం 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో భాజపా బలం 12 నుంచి 14కు చేరింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఎంజీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో సుదిన్‌ ధావలీకర్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
*గెలుపు దిశగా లక్ష్మణరావు
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి కె.ఎస్‌.లక్ష్మణరావు గెలుపు బాటలో దూసుకెళుతున్నారు. గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి లక్ష్మణరావు 46,746 ఓట్లతో ప్రత్యర్థులకు అందనంత ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్య 6,331 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. లక్ష్మణరావు భారీ ఆధిక్యతతో ఉండటంతో ఆయన గెలుపు లాంఛనప్రాయం కానుంది. మరో 3 రౌండ్లను లెక్కిస్తే కౌంటింగ్‌ పూర్తవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్లు పీడీఎఫ్‌ అభ్యర్థికి ఓట్లు వేసి మద్దతు పలికారు. జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, పరిశీలకులు నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు.
*నోట్ల రద్దు నిర్ణయంపై దర్యాప్తు చేస్తాం
లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే నోట్ల రద్దుపై దర్యాప్తు చేస్తామని, జీఎస్టీని సమీక్షిస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. తమ పార్టీ 67 పేజీల ఎన్నికల ప్రణాళికను ఆమె బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోట్లరద్దు నిర్ణయంపై పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నీతి ఆయోగ్‌ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని… ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు మమతా బెనర్జీ స్పందించటానికి నిరాకరించారు. రాహుల్‌ చిన్న పిల్లాడని వ్యాఖ్యానించారు.
*జగన్‌లా మోదీకి మోకరిల్లను
‘ప్రతిపక్ష నాయకుడు జగన్‌ నా పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు. చంద్రబాబు భాగస్వామి అని, యాక్టర్‌ అని పిలుస్తున్నారు. సినిమాల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన నన్ను యాక్టర్‌ అని పిలిస్తే, రెండేళ్లు జైల్లో ఉండి వచ్చిన జగన్‌ను ఏమని పిలవాలి?’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘మీరేమైనా మహాత్మాగాంధీలా పోరాడి జైలుకు వెళ్లారా? ప్రజాధనం అడ్డంగా దోచుకుని వెళ్లారు. నేను చంద్రబాబు భాగస్వామినైతే.. మీరు భాజపా, అమిత్‌షాలకు భాగస్వామా?’ అని నిలదీశారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఒంగోలులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘
*ప్యాకేజీ ఇస్తామని ప్రకటించాకే లేఖ
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాలపై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్‌ చేశారు. ప్రత్యేక హోదాతో ఇచ్చే రాయితీలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2016 సెప్టెంబరులో కేంద్రం ప్రకటించిందన్నారు.
*ఈసీ పరిధి దాటింది- తెదేపా
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పరిధి దాటి వ్యవహరించిందని తెదేపా నేతలు కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎంరమేశ్‌, జూపూడి ప్రభాకర్‌రావులు ఆరోపించారు. అది ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం తగ్గుతుందని వారు తెలిపారు. బుధవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలను వారు కలిసి సీఎం చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు.
*చంద్రబాబుపై దాడికి జగన్‌ కుట్ర: రాజేంద్రప్రసాద్‌
ముఖ్యమంత్రి చంద్రబాబుపై భౌతికంగా దాడి చేయించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ కుట్ర పన్నారని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, మారణకాండలు జరుగుతాయని పులివెందుల సభలో జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా అందుకు మోదీ, కేసీఆర్‌, జగన్‌ బాధ్యత వహించాలని చెప్పారు. ‘సీఎం చంద్రబాబు భద్రతకు ముప్పు తలపెట్టే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్‌ డీజీని బదిలీ చేయాలని వైకాపా నేతలు ఫిర్యాదు చేస్తే కనీస విచారణ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం దారుణం. విజయసాయిరెడ్డి ఓ కాగితం ఇవ్వగానే స్పందిస్తుంది.
*ఎన్నికల సంఘం నిర్ణయాలు ఆశ్చర్యకరం: కోడెల
ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని శాసనసభ సభాపతి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయనిక్కడ విలేకర్లతో మాట్లాడారు. మొన్న శ్రీకాకుళం కలెక్టర్‌ బదిలీ.. ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీల బదిలీల నిర్ణయాలు చట్ట వ్యతిరేకంగా జరిగినట్లు ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ఏం చెబితే అది చేస్తారా?.. అని ఈసీని ప్రశ్నించారు. నిఘా విభాగాధిపతి చీఫ్‌ ఎన్నికల సంఘం పరిధిలోకి రానప్పటికీ ఆయనను ఎలా బదిలీ చేస్తారో చెప్పాలన్నారు. వివేకా హత్యలో నిజాలు బయటపడతాయనే కడప ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చిన్నాన్న హత్యను జగన్‌ చేయించాడని చెప్పను..కానీ, అతడికితెలిసే అంతాజరిగిందని ప్రజలంతా అనుకుంటున్నారని కోడెల అన్నారు.
*రైల్వే, ఎయిర్‌ ఇండియాలకు ఈసీ నోటీసులు
రైలు టికెట్లు, ఎయిర్‌ ఇండియా బోర్డింగ్‌ పాస్‌లపై ప్రధాని నరేంద్ర మోది చిత్రాలను ముద్రించటానికి సంబంధించి రైల్వే, విమానయాన మంత్రిత్వశాఖలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. ప్రజాధనంతో ఒక రాజకీయపార్టీకి లబ్ధి చేకూర్చేలా ప్రచారం చేయటం ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించటమే అవుతుందని ఆ నోటీసుల్లో గుర్తుచేసింది.
*గోవాలో అర్ధరాత్రి అనూహ్య రాజకీయం
గోవాలో అర్ధరాత్రి అనూహ్యమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయి. 2012 నుంచి మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం కావడం, దరిమిలా ఆ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చకాచకా జరిగిపోయాయి. ఈ చర్యతో మొత్తం 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో భాజపా బలం 12 నుంచి 14కు చేరింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఎంజీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో సుదిన్‌ ధావలీకర్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే మనోహర్‌ అజ్‌గావ్‌కర్‌ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అజ్‌గావ్‌కర్‌తో పాటు మరో ఎమ్మెల్యే దీపక్‌ పవాస్‌కర్‌లు మంగళవారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో తమది ఒక ప్రత్యేక వర్గమని ప్రకటించుకున్నారు.
*అంబేడ్కర్‌కు అచ్చిరాని లోక్‌సభ
లోక్‌సభలో అడుగుపెట్టాలన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కలలు కలలుగానే మిగిలిపోయాయి. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ ఫెడరేషన్‌ తరఫున అప్పటి ఉత్తర బొంబయి(రిజర్వ్డు) స్థానం నుంచి అంబేడ్కర్‌ పోటీకి దిగారు. గతంలో అంబేడ్కర్‌ సహాయకుడైన నారాయణ్‌ సడోబా కజ్రోల్కర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. నారాయణ్‌ చేతిలో అంబేడ్కర్‌ 4,561 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 3 ఏప్రిల్‌ 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 ఏప్రిల్‌ 1956 వరకూ కొనసాగారు. ఈ మధ్యలో 1954లో బాంద్రా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్కర్‌ విజయం సాధించారు. 3 ఏప్రిల్‌ 1956లో రెండో దఫా
*నేటి నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం
వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గురువారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి స్థానిక నియోజకరవర్గంలో ప్రచారం చేస్తారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆమె ప్రచారం నిర్వహిస్తారని వైకాపా కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. వైఎస్‌ షర్మిల శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెడతారు.
*జగన్‌, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలి
అనేక ఆర్థిక నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దుచేసి, మళ్లీ కస్టడీలోకి తీసుకునేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శాసనమండలిలో తెదేపా విప్‌ బుద్ధా వెంకన్న బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ వైకాపా నాయకులిద్దరూ…. ప్రతిరోజూ బెయిల్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని, పోలీసు అధికారుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారని వెంకన్న ఫిర్యాదు చేశారు.
*అప్పట్లో లాటరీ ఎన్నికలు
మనదేశంలో చోళుల పాలనలో లాటరీ వంటి ఓ వినూత్న ఎన్నికల వ్యవస్థ ఉండేది. దాని పేరు ‘కుడవొలై వ్యవస్థ’. తమిళంలో కుడం అంటే కుండ, వొలై అంటే ఆకు అని అర్థం. ఈ విధానంలో అభ్యర్థుల పేర్లను తాటాకులపై రాసి కుండలో వేసేవారు. వాటన్నింటినీ బాగా కలిపి.. ఎవరైనా చిన్నారితో ఒక్కో ఆకును బయటకు తీయించేవారు. వాటిపై ఎవరి పేరుంటే వారు ఎన్నికైనట్లు అర్థం. ‘కుడవొలై వ్యవస్థ’లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని అర్హతలు తప్పనిసరి. అవేంటంటే.. వారి వయసు 35-70 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉండాలి. దానికి పన్ను చెల్లింపు సక్రమంగా జరిగి ఉండాలి. అభ్యర్థులు వేదాలు, మంత్రాలపై అవగాహన కలిగి ఉండాలి. దొంగతనాలు, హత్యల వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులు పోటీకి అనర్హులు.
*తప్పులు కప్పి పుచ్చేందుకే జగన్ ఫిర్యాదులు
ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం నేరస్తుల ఫిర్యాదుల పై చర్యలు తీసుకుంటూ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తోందని తెదేపా రాష్ట్ర అద్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఇంటలిజెన్స్ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను కనీస విచారణ లేకుండా బదిలీ చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జగన్ కు ఇరవై ప్రశ్నలతో బుధవారం కళా వెంకట్రావు హబిరంగా లేఖ రాశారు.
*భీమవరం బుల్లోడేవారు.?
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అత్యధికంగా కాంగ్రెస్ 7 తెదేపా 5 పర్యాయాలు గెలుపొందాయి. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో తెదేపా తరపున పులవర్తి రామాంజనేయులు విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి తలపడుతున్నారు. గ్రంధి శ్రీనివాస్ వైకపా తరపున పోటీ చేస్తున్నారు.
*గాజువాకలో ముగ్గురే ముగ్గురు
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వైకాపా అభ్యర్ధిగా తిప్పల నాగిరెడ్డి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధి తిప్పల నగిరేది పై పల్లా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చింతలపూడి వెంకటరామయ్య గెలిచారు. ప్రస్తుతం శ్రీనివాసరావు నాగిరెడ్డి కూడా బలమైన స్థితిలో ఉండడంతో పోటీ ఉత్కంటంగా మారింది.
*నారీ నారీ నడుమ భేరి
అక్కడ ప్రధాన పార్టీలైన తెదేపా వైకాపా మహిళలనే బరిలోకి దించాయి. నలుగు స్థానాల్లో వారి మధ్యే పోటీ నెలకొంది. విశాఖ జిల్లా పాడేరు తూర్పుగోదారి జిల్లా రంపచోడవరం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా, వైకాప మహిళా అభ్యర్ధులను బరిలో నిలిపాయి. గత ఎన్నికల్లో వైకాపా తరపున పాడేరు నుంచి పోటీ చేసిన ఈశ్వరి. రంపచోడవరం అభ్యర్ధిని రాజేశ్వరి ఈసారి తమ స్థానల్లో తెదేపా తరపున బరిలో నిలిచారు. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు మారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై తానేటి వైకాపా బరిలోకి దించింది. అనంతపురం జిల్లా సింగనమల స్థానంలో వైకాపా అభ్యర్ధిని పద్మావతి పై తెదేపా నుంచి కొత్త అభ్యర్ధిని శ్రావణి తలపడుతున్నారు. మరోవైపు ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన, దాని మిత్రపక్షాలు పురుష అభ్యర్ధులను రంగంలోకి దించడం విశేషం.
*మండ్య లో నలుగురు సుమలతలు
దక్షిణ కర్నాటకలోని మండ్యా పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న నటి సుమలతకు చికాకులు తప్పట్లేదు. సుమలత పేరున్న మరో ముగ్గురితో ప్రత్యర్ధులు నామినేషన్ వేయించారు. కాంగ్రెస్ లో పొత్తు మీరలు జేడీ ఎస్ నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానాన్ని కాంగ్రెస్ నుంచి ఆశించి భంగపడిన సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు. దివంగత నటుడు అంబరీష్ కు సంఘీభావంగా, ఆయన భార్య అయిన సుమలతకు భాజపా మద్దతు ప్రకటించింది. నిఖిల్, నటి సుమలత మధ్య గట్టిపోటీ నెలకొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com