రాజకీయాలు.. వివాదాలు.. ఆస్తులు.. ఆటలు.. అన్నీ కలిస్తే శరద్ పవార్. దేశ రాజకీయాల్లో పవార్‌ది ప్రత్యేక పాత్ర. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. 37 ఏళ్లకే మహారాష్ట్ర సీఎం పీఠమెక్కారు. కాంగ్రెస్‌లో ఉండి ఏకంగా సోనియా గాంధీ జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాలు-విమర్శలు ఎన్ని ఎదురైనా దీటుగా ఎదుర్కొన్నారు.
పూర్తి పేరు: శరద్ చంద్ర గోవింద్‌రావ్ పవార్
జననం: 1940 డిసెంబరు 12న బారామతిలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో
తొలి విజయం: 1967లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా (కాంగ్రెస్)
**తొలిసారి సీఎం పీఠంపై..
పవార్ 1978లో కాంగ్రెస్ నుంచి విడిపోయి, జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తొలిసారిగా సీఎం పదవిని అలంకరించారు. కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరిలో పీడీఎఫ్ ప్రభుత్వం రద్దయింది. 1983లో కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీ అధ్యక్ష బాధ్యతలను పవార్ స్వీకరించారు. 1984లో బారామతి నుంచి ఎంపీగా గెలిచారు. మరుసటి ఏడాది అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్(సోషలిస్ట్) 54 సీట్లు దక్కించుకోవడంతో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు.
**శివసేనకు కళ్లెం వేసే బాధ్యత
1987లో పవార్ కాంగ్రెస్(ఐ) గూటికి చేరుకున్నారు. మహారాష్ట్రలో శివసేన పట్టు పెరగకుండా చూసే బాధ్యతను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. దాన్ని నిర్వర్తించడంలో చాలావరకు సఫలమయ్యారు! 1988లో అప్పటి మహారాష్ట్ర సీఎం శంకర్‌రావు చవాన్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా రాజీవ్ గాంధీ తన మంత్రిమండలిలోకి తీసుకోవడంతో పవార్ తిరిగి సీఎం అయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపా-శివసేనల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్‌కు 141 సీట్లు వచ్చాయి. దీంతో 12 మంది స్వతంత్రుల మద్దతుతో పవార్ మళ్లీ సీఎం పీఠమెక్కారు.
ప్రధాని పదవి రేసులో..
రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి రేసులో పవార్ నిలిచారు. ఆయనతోపాటు పీవీ నరసింహారావు, ఎన్డీ తివారీ పేర్లను కాంగ్రెస్ పరిశీలించింది! చివరకు పీవీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా.. పవార్ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆపై మహారాష్ట్ర సీఎం పదవి నుంచి సుధాకర్‌రావు నాయక్ దిగిపోవడంతో దేశ రాజకీయాల్లో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తిరిగి పవార్‌ను ముఖ్యమంత్రిగా చేశారు పీవీ.
**ఎన్సీపీ స్థాపన
12వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పవార్ పనిచేశారు. 1999లో ఆ సభ రద్దయ్యాక.. సోనియా గాంధీని కాకుండా భారత్‌లో పుట్టిన ఇతర నేతనెవరినైనా ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించాలని పవార్, పి.ఎ.సంగ్మా, తారిక్ అన్వర్ డిమాండ్ చేశారు. సోనియా జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే ఏడాది జూన్‌లో పవార్, సంగ్మా కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ని స్థాపించారు. 2004లో తిరిగి యూపీయేలో చేరిన పవార్.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
**ఆటలతో అనుబంధం
పవార్‌కు క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముంబయి క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర రెజ్లింగ్, కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తోపాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి నేతృత్వం వహించారు.
**లెక్కలేనన్ని వివాదాలు
పవార్ తన రాజకీయ జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎంగా ఉండి నేరగాళ్లను రక్షించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పవార్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు పన్ను మినహాయింపు వంటి వ్యవహారాల్లో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆస్తుల ప్రకటనలో పవార్ పారదర్శకత పాటించలేదనే ఆరోపణలున్నాయి.
**వారసత్వం
పవార్ కుమార్తె సుప్రియా సూల 16వ లోక్‌సభ సభ్యురాలు. 2009, 2014 ఎన్నికల్లో బారామతి నుంచి ఎంపీగా ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
**పద్మ విభూషణ్
మనదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ 2017లో పవార్‌ను వరించింది.
ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపై నడిపించడంలో పవార్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్ పొత్తుకు ఇది కూడా ఒక కారణం.
