మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో భారత్ విజయయాత్ర కొనసాగిస్తోంది. శుక్రవారం పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-0 గోల్స్ తేడాతో విజయం సాధించి దిగ్విజయంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు గోల్‌లు సాధించారు. మొదటి 30 నిమిషాల్లో ఆరు గోల్‌లు సాధించిన భారత్, చివరి అర్థ భాగంలో నాలుగు గోల్స్ చేసి విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుకు ఒక గోల్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. సుల్తాన్ అజ్లాన్ షా టోర్నమెంటులో భారత్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో భారత్ ఆడిన ఐదు లీగ్ మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఒక డ్రాతో 13 పాయింట్లు సాధించింది. భారత స్ట్ర్రెకర్ మణ్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. బుధవారం కెనడాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి 7-3 గోల్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పోలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు మన్‌ప్రీత్‌సింగ్‌కు బదులు సురేంద్రకుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విజయంతో టోర్నమెంటులో భారత్ మొత్తం ఐదు లీగ్ మ్యాచుల్లో 18 గోల్లు సాధించింది. 13 పాయింట్లతో తమ గ్రూపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం దక్షిణ కొరియాతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
