కృష్ణాజిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. ఈ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెదేపా, వైకాపా మధ్యనే నెలకొని ఉంది. ఇప్పటి వరకు వైకాపా అభ్యర్ధి ప్రస్తుత శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గత ఆదివారం నాడు వై.ఎస్.జగన్ తిరువూరు పర్యటన అనంతరం వైకాపా జోరు మరింతగా పెరిగింది. చివరి నిముషంలో కొవ్వూరు నుండి తిరువూరుకు ఆకస్మికంగా తరలి వచ్చిన తెదేపా అభ్యర్ధి, ఎక్సైజ్ మంత్రి కే.ఎస్.జవహర్ ప్రచారాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి జవహర్ ముమ్మర ప్రచారంలో నిమగ్నమయ్యారు. తిరువూరు తెదేపా టికెట్ పై గంపెడంత ఆశ పెట్టుకున్న మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ తొలుత జవహర్ కు సహకరించడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు జోక్యంతో స్వామిదాస్ ఎన్నికల రంగంలోకి దిగారు. జవహర్ ను వెంటపెట్టుకుని స్వామిదాస్ నియోజకవర్గంలో తెదేపా ప్రచారానికి ఊపును తీసుకువచ్చారు. స్వామిదాస్ కు టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన అనుచరులు ఇతర దేశం నాయకులూ ఇప్పుడిప్పుడే జవహర్ కు అనుకూలంగా ప్రచార రంగంలోకి దిగారు. ఆర్ధికంగా పెద్దగా లేని వైకాపా అభ్యర్ధి రక్షణనిధి పార్లమెంటు అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ సహకారంతో తెదేపా అభ్యర్ధితో పోటీగా ఖర్చు పెడుతున్నారు. ఇరుపార్టీల అభ్యర్ధులు మందీమర్భాలంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అద్దె జనాన్ని పోగుచేసి వారిని రోజుకు మూడు వందల లెక్కన కూలీ ఇస్తూ చికెన్ భోజనాలు పెడుతూ అభ్యర్ధులు తమ వెంట ప్రచారంలో ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కార్యకర్తలకు కూడా అభ్యర్ధులు భారీగా సొమ్ములు అందజేస్తున్నారు. బూత్ ల వారీగా ఇరు పార్టీల అభ్యర్ధులు ఒక్కొక్క బూత్ కు ఇప్పటి వరకు ఇరవై వేలు ఇచ్చి బూత్ లెవల్లో విడిగా ప్రచారం చేయటానికి కార్యకర్తలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వైకాపా అభ్యర్ధి రక్షణనిధి గడపగడపకు వైకాపా పేరుతొ ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గం అంతా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఓటమి పాలైన తెదేపాను మళ్ళీ ఓడించాలని వైకాపా నాయకులు పకడ్బందీగా ప్రణాళికలు వేస్తున్నారు. రక్షణనిధికి మంచి వ్యక్తిగా అవినీతి మారక లేని నేతగా స్థానిక ప్రజల్లో గుర్తింపు ఉంది. **తెదేపా విషయానికొస్తే ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించే ప్రయత్నం జవహర్ చేయవలసి ఉంది. కొంతమంది నేతలకు జవహర్ పెత్తనం అప్పగించడంతో మరి కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశానికి పెద్ద సమస్య ఒకటి ఉంది. ఆపార్టీకి మంచి కార్యకర్తలు బలం ఈ నియోజకవర్గంలో ఉంది. అయితే తెదేపా నాయకులకు కార్యకర్తలకు మధ్య అగాదం ఉంది. గత ఐదేళ్ళ నుండి తెలుగుదేశం నేతలు తమకు రూపాయి దక్కకుండా అన్ని కాంట్రాక్టులను వారే దక్కించుకుని లక్షలాది రూపాయలు సంపాదించారని, ఒక్క రూపాయి కూడా కార్యకర్తలకు దక్కనీయ లేదని ఆపార్టీ కార్యకర్తలు బాహాటంగానే వాపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు పర్యటన అనంతరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగవుతుందని తిరువూరులో తాము ఈసారి తప్పనిసరిగా విజయం సాధిస్తామని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడూ ఆర్ధికంగా బాగా ఉన్న ఎక్సైజ్ శాఖా మంత్రి కే.ఎస్.జవహర్ కూడా భారీగా ఖర్చు చేయడానికి సిద్దపడుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. దీనితో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈసారి విజయం తెదేపాదేనని ధీమాతో ఉన్నారు. – కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్టు.
