ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు

సామాన్య వ్యక్తిగా రాజకీయ అరంగేట్రం చేసి.. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6వ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన హయాంలోనే జిల్లాలో విద్య, వైద్యం, విద్యుత్, రహదారి రంగాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి.
*1957 అసెంబ్లీ ఎన్నికల్లో వెంగళరావుకు కాంగ్రెస్‌ పార్టీ సీటు లభించలేదు. ఆయన తమ్ముడు జలగం కొండల్‌రావు వేంసూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత వెంగళరావు 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984, 1989లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన వెంగళరావు.. ఇటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేయడంతోపాటు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను ఆయన భుజాల మీద పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ పాలన విధానాలపై ధ్వజమెత్తిన నేత వెంగళరావు. తాను ఏ పదవిలో ఉన్నా. ఆ పదవికి వన్నె తెచ్చారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం ఎవరినైనా ఎదిరిస్తారనే పేరు వచ్చిందాయనకు. అలాంటి జలగం రాజకీయ ప్రస్థానంలో ఒక్కటి మినహా అన్నీ విజయాలే.
**జడ్పీ చైర్మన్‌గా..
తొలుత ఆయన ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా 1959లో బాధ్యతలు చేపట్టగా.. ఆ తర్వాత కొద్ది కాలానికి పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్యక్ష పదవి ఆయనను వరించింది. పంచాయతీరాజ్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆకళింపు చేసుకోవడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య వంటి ప్రజోపయోగ పనులను నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. రాష్ట్ర హోం మంత్రిగా శాంతిభద్రతల పర్యవేక్షణతోపాటు అప్పుడున్న నక్సల్‌ సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నారనే పేరుంది.
ఒకేసారి 120 పాఠశాలలు
జలగం జడ్పీ చైర్మన్‌ కావడానికి ముందు జిల్లాలో ఖమ్మం, మధిరలో మాత్రమే ఉన్నత పాఠశాలలుండేవి. ఆయన కృషితో ఒకేసారి 120 పాఠశాలలు ఏర్పడ్డాయి. వెంగళరావుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒకసారి చూసిన వ్యక్తిని కానీ, విన్న, చదివిన విషయాన్ని కానీ మర్చిపోయే వారు కాదు. ఆయా విషయాలకు సంబంధించిన అంకెలను తడుముకోకుండా చెప్పేవారు.
**నిజాంపై పోరు..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన తిరువూరు కేంద్రంగా పోరు సలిపారు. అనేకసార్లు ఆయనపై రజాకార్ల దాడులు జరిగాయి. వెంగళరావు తిరువూరులో ఉన్న ఆయన మామ ఇంటికి తరచూ వెళ్తారనే సమాచారంతో ఒకసారి రజాకార్లు అక్కడ కూడా మాటేశారు. వెంగళరావు ఆ రోజు అక్కడికి వెళ్లకపోవడంతో రజాకార్లు ఆయన మామ మాధవరావుపై దాడి చేసి, ఆయనను హత్య చేశారు.
**గుమాస్తా పాఠాలు
రాజకీయాల్లోకి రాకముందు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో పంచాయతీరాజ్‌ శాఖలో గుమాస్తా ఉద్యోగం చేశారు. అప్పటి అనుభవం నేర్పిన పాఠాలతో ఆయన.. పంచాయతీరాజ్‌ సంస్థల అభివృద్ధికి, వాటి ప్రక్షాళనకు నివేదిక తయారు చేశారు. ఇది ‘వెంగళరావు నివేదిక’గా పేరుపడింది. పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి తన నివేదికలోని అంశాల అమలుకు పూనుకున్నారు. అనేక పదవులు అలంకరించిన వెంగళరావు తనను వ్యతిరేకించే వారిపై కఠినంగా ఉండేవారని చెబుతారు.జలగం వెంగళరావు 1922, మే 4న శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు. 20వ ఏట ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం వచ్చి స్థిరపడ్డారు. నైజాం వ్యతిరేక పోరాటాన్ని ఆ ప్రాంతం నుంచే ప్రారంభించిన వెంగళరావు.. జెడ్పీ చైర్మన్‌గా, రాష్ట్ర హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ కాలంలో అభివృద్ధిలో జిల్లాను పరుగులు తీయించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగేవారాయన. పోలీసుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)