ప్రతి విషయంలో ఎప్పుడూ ముందుండే అమెరికాను తాజాగా డ్రాగన్ చైనా వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలోనే 5జీ సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా షాంఘై రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి చైనా ముందడుగు వేసినట్లైంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక పత్రిక చైనా డైలీలో తన కథనంలో పేర్కొంది.‘ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైనా మొబైల్ 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్‌ను అధికారికంగా షాంఘై జిల్లాలో శనివారం నుంచి ప్రారంభించింది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా మొత్తం 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినట్లైంది’ అని చైనా డైలీ తెలిపింది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాంఘై వైస్ మేయర్ వూ క్వింగ్.. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోల్డబుల్ ఫోన్ అయిన హువాయ్ మేట్ ఎక్స్ నుంచి తొలి 5జీ వీడియోకాల్‌ను చేశారు. వినియోగదారులు తమ సిమ్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోకుండానే ఈ సేవలను పొందవచ్చని తెలిపారు
