ఉన్నట్టుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం… ఈ వేసవిలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. శరీరం బలహీనంగా ఉండటం, రక్తలేమి, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం వంటివన్నీ ఇందుకు కారణాలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దామా…సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే రోజులో కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. శరీరంలో ఆహారంతోపాటు నీటి శాతం తగ్గకూడదు. అలా తగ్గితే, కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. గంటకోసారి గ్లాసు నీటిని తాగుతూ ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. అప్పుడప్పుడు శరీరానికి విశ్రాంతి ఇస్తూ ఉండాలి. లేదంటే శరీరం త్వరగా అలసిపోతుంది. కొన్నిసార్లు నిద్రలేమితోనూ అలసటగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. అప్పుడు కూడా విపరీతమైన నీరసం, కళ్లు తిరిగుతున్నట్లు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు, సరిపడా గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే.ఉసిరి రసం, అల్లం రసం, చక్కెర కప్పు చొప్పున తీసుకుని కలిపి మరిగించి పానీయంలా చేసి భద్రపరుచుకోవాలి.ప్రతిరోజూ రెండు పూటలా 30 మి.లీ పరిమాణంలో ఈ పానీయాన్ని తాగితే, నీరసం దరిచేరదు. అలాగే అరకప్పు పానీయంలో అరకప్పు మంచి నీటిని కలిపి తాగొచ్చు. ఇది తక్షణ శక్తినిస్తుంది.గ్లాసు పల్చని మజ్జిగలో చెంచా గులాబీరేకల ముద్ద, చెంచా చక్కెర కలిపి తాగితే నీరసం నుంచి ఉపశమనం కలుగుతుంది.గ్లాసు గోరువెచ్చని నీటిలో పెద్ద చెంచా నిమ్మరసం, చెంచా అల్లం రసం, రెండు చెంచాల తేనె కలిపి తాగితే నీరసం నుంచి తేరుకోవచ్చు.గ్లాసు పల్చని మజ్జిగలో పుదీనా రసం, నిమ్మరసం చెంచా చొప్పున కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగాలి. దీంతో కళ్లు తిరగడం తగ్గి, శక్తి వస్తుంది.గ్లాసు నల్లద్రాక్ష రసం తాగినా నీరసం నుంచి తేరుకోవచ్చు.మంచి కర్పూరం వాసన చూస్తే మెదడు ఉత్తేజమై, నీరసం తగ్గుతుంది.మంచి గంధం, కర్పూరం, కొంచెం కొబ్బరి నూనె కలిపి నుదిటిపై లేపనంలా వేస్తే, నిస్త్రాణం నుంచి బయటపడొచ్చు.
