కడపలో తేదేపాకు మరో షాక్–తాజావార్తలు–03/30

* సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీకి కడప జిల్లాలో మరో షాక్ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. రాజంపేట లోక్‌సభ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. టీడీపీలో సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయి ప్రతాప్ మాట్లాడుతూ.. కడప సమస్యల పరిష్కారానికే టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు తీరువల్ల మనోవేదనకు గురయ్యాను. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
* ద్ర‌విడ మున్నేత్ర క‌జ‌గం(డీఎంకే) కోశాధికారి దురై మురుగ‌న్ నివాసాల్లో ఇవాళ ఆదాయ‌ప‌న్నుశాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. వెల్లోర్ జిల్లాలోని కాట్పాడిలో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 10.30 డీఎంకే నేత ఇంటికి వ‌చ్చిన అధికారులు శ‌నివారం కూడా సోదాలు చేస్తూనే ఉన్నారు. మురుగ‌న్ కుమారుడు కాతిర్ ఆనంద్ ఈసారి వెల్లోర్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు. ఐటీ శాఖ ఉద్యోగులు అయిదు బృందాలుగా మారి సోదాలు చేస్తున్నారు.
* విశాఖలో బార్ అసోసియేషన్ 125 వసంతాల వేడుకకు ఉప రాష్ట్రపతి వెంకయ్య హాజరయ్యారు. తన ఎదుగుదల అక్కడి నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు.న్యాయవ్యవస్థపై ప్రజలంతా గౌరవం కలిగి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. విశాఖలో బార్ అసోసియేషన్ 125 వసంతాల వేడుకకు ఆయన హాజరయ్యారు. తన ఎదుగుదల అక్కడి నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు. తెన్నేటి విశ్వనాథం వంటి మహానుభావులు తమ వృత్తి జీవితాన్ని విశాఖ నుంచే ప్రారంభించారన్నారు. ప్రపంచంలోనే భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేకత ఉందని… 130 కోట్ల భారతీయుల విశ్వాసాన్ని కోర్టులు పరిరక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఈ సాయంత్రం విశాఖపట్నం ఐఐఎం మూడో స్నాతకోత్సవానికి వెంకయ్య హజరుకానున్నారు.
* అమరావతిరాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది.కర్నూలులో 42డిగ్రీలు, నంద్యాల, కడప, అనంతపురంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్ర గాలుల ప్రభావంతో కోస్తాలో ఉక్కపోత పెరిగింది.వచ్చే 3రోజుల్లో మరింత తీవ్రం మధ్యాహ్నం బయటకు రావొద్దు-RTGS, ISROనిపుణుల హెచ్చరిక
* మంచిర్యాల జిల్లాలో గల పత్తి విత్తన కేంద్రాలపై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, కన్నెపల్లి, నెన్నెల్, తాళ్ల గురజాలలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న 13 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 66 లక్షల విలువచేసే 33 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* చీమలపాడు పెదతండాలో మహిళ హత్యఅలుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన స్ధానికులు.
* రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆరోజు సెలవు ప్రకటించింది. పోలింగ్‌కు ముందు రోజైన ఏప్రిల్ 10న, కౌంటింగ్ జరిగే మే 23వ తేదీన అవసరమైనచోట సెలవులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్ జోషి ఉత్తర్వులు జారీచేశారు.
ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం, ఏప్రిల్ 10న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పోలింగ్ ఏర్పాట్ల కోసం, మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లకు స్థానికంగా సెలవులు మంజూరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది
*ఎన్నికల్లో పాల్గొనే ముందు అభ్యర్థులంతా నేర చరిత్రను ప్రకటించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనకు గురైందనే ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. సదరు ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది అశ్వినికుమార్‌ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి(ఈసీ) నోటీసులు జారీ చేసింది.
* భారత్‌ యాంటీ శాటిలైట్‌ ప్రయోగం నిర్వహించినప్పుడు అమెరికాకు ఎటువంటి గూఢచర్యం నిర్వహించలేదని పెంటగాన్‌ పేర్కొంది. ఈ ప్రయోగం తర్వాత డిగోగార్సియా స్థావరం నుంచి అమెరికా విమానం ఒకటి బంగాళఖాతంలోకి ప్రవేశించింది. దీనిపై పెంటగాన్‌ వివరణ ఇస్తూ భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసని పేర్కొంది.
*రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఆయనతో పాటు ఆరుగురు సభ్యుల పదవీ కాలం కూడా ముగిసింది. పదవీకాలం ముగింపు సందర్భంగా స్వామిగౌడ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు.
*వీవీప్యాట్లు 50% లెక్కించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పష్టం చేసింది. ‘‘ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఆ విధంగా లెక్కించాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400కి మించి పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.
* దేశంలో అరకు లోయ సహా వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 5 ప్రత్యేక రకాల కాఫీలకు తాజాగా భౌగోళిక సూచి (జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ – జీఐ) గుర్తింపు లభించింది. అరకుతో పాటు కూర్గ్‌, చిక్‌మగళూర్‌, బాబాబూదన్‌ గిరులకు చెందిన అరేబికా రకాలకు, వాయనాడ్‌ రోబస్టా రకం కాఫీకి కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని పరిశ్రమ, అంతర్గత వ్యాపారాల అభివృద్ధి విభాగం జీఐ ట్యాగ్‌ ఇచ్చింది. తాజాగా గుర్తింపు పొందిన కాఫీల్లో కూర్గ్‌ (కొడగు జిల్లా), చిక్‌మగళూర్‌ (మల్నాడ్‌ ప్రాంతంలోని దక్కన్‌ పీఠభూమి), బాబాబూదన్‌ గిరులకు చెందిన రకాలు కర్ణాటకలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో గిరిజనులు సేంద్రియ విధానంలో కాఫీ సాగు చేస్తున్నారు. వాయనాడ్‌ రోబస్టా కేరళ తూర్పు ప్రాంతంలోని వాయనాడ్‌ జిల్లాలో ప్రత్యేకంగా పెరుగుతుంది. బాబాబూదన్‌ గిరులు భారత్‌లో కాఫీకి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందాయి. జీఐ పొందిన కాఫీ ప్రాంతాల్లో ఉత్పత్తిదారులు నిర్ణీత ప్రమాణాలను పాటిస్తారు. ఈ గుర్తింపు ప్రపంచంలో భారతీయ కాఫీ పరిధిని విస్తరించేందుకు దోహదపడుతుంది. ఒకసారి జీఐ ట్యాగ్‌ లభిస్తే ఇతర ఉత్పత్తిదారులెవరూ మార్కెట్‌లో ఆ పేరును దుర్వినియోగం చేయడానికి వీలుపడదు. ఉత్పత్తిదారులకు గరిష్ఠ ధర కూడా లభిస్తుంది.
*ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1955-60 మధ్య చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆకట్టుకుంది. ఎనిమిది పదుల వయసు దాటినా..అరవై ఏళ్ల స్నేహబంధాన్ని తలచుకుంటూ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద మంది ఒక్కచోట కలుసుకున్నారు. నాటి అనుభూతుల్ని నెమరువేసుకున్నారు.
*తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలిప్పిస్తామంటూ వేలమందిని మోసం చేసిన ఎలైట్‌ సంస్థ లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్‌లో కలిపి ఈ సంస్థ రూ.150కోట్లు స్వాహా చేసినట్లు పోలీసు లు అంచనా వేస్తున్నారు.
*కడప జిల్లా కలసపాడు మండలం ముద్దిరెడ్డిపల్లెకు చెందిన వృద్ధుడు, వైకాపా కార్యకర్త నడిపి వెంకటరెడ్డి(70) వడదెబ్బతో మృతి చెందారు.
*ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికల పూర్తయ్యేంత వరకూ భృతి కింద చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచరాదని స్పష్టం చేసింది.
*రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలను ఏప్రిల్‌ 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి సంచాలకుడు మధుసూధన్‌ తెలిపారు. 6-9 తరగతులకు ఏప్రిల్‌ 13 నుంచి 22వ తేదీ వరకు సంబంధిత పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో.. గతంలో ప్రకటించిన సమ్మెటివ్‌ పరీక్షల తేదీలను పూర్తిగా మార్చివేసి ఈ మేరకు నూతన షెడ్యూల్‌ విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
*విజయవాడ డివిజన్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున ఏప్రిల్‌ ఒకటో తేదీన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌లో రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ మేరకు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి శుక్రవారమిక్కడ తెలిపారు.
*ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) డొల్ల కంపెనీలకు రాష్ట్రంలోని వేల ఎకరాల భూముల్ని కట్టబెట్టిందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు తీర్పు ఇచ్చింది. భూకేటాయింపులపై అభ్యంతరం ఉంటే సంబంధిత అధారిటీని ఆశ్రయించొచ్చని పిటిషనర్‌కు సూచించింది.
*ప్రభుత్వ ఉద్యోగులకు 63 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య కోరారు. 2018 జులై నుంచే 11వ పీఆర్‌సీని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఉద్యోగులకు 35 శాతం, జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 25 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలని 11వ వేతన సవరణ సంఘం కమిషనర్‌ అశుతోష్‌ మిశ్రాను శుక్రవారం సచివాలయంలో కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
*రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 22 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్‌లో అత్యధికంగా ముగ్గురు బరిలో నిలవగా; మెదక్‌, హైదరాబాద్‌, భువనగిరి నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు. ప్రధాన పార్టీలైన తెరాస తరఫున నిజామాబాద్‌, మహబూబాబాద్‌లలో; కాంగ్రెస్‌ తరఫున ఖమ్మంలో; భాజపా నుంచి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లలో పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా 8 మంది, వివిధ పార్టీల నుంచి 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
*ఎండ మండిపోతోంది. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో శుక్రవారం 41.6 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెంలో 42.2 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా రామగుండంలలో 42 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్‌, ములుగు మండలం చెలపూర్‌లలో 41.9 డిగ్రీలు నమోదైంది.
*లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 11వ తేదీ, ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే మే 23ని సాధారణ సెలవు దినాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొంది.
*భారతీయులు చదువు, ఉద్యోగాలకు వివిధ దేశాలకు వెళ్తున్నవారు గతంతో పోల్చుకుంటే అధికంగానే ఉన్నారు. అలాంటివారు అక్కడి నుంచి వచ్చి ఓటు వేయాలంటే ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారంతా తాపత్రయపడుతుంటారు. ఇటీవల ఓటు నమోదుకు అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా 2,100 మంది ప్రవాసభారతీయులు ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారంతా ఓటు వేయాలంటే లక్షలు ఖర్చుచేసి రావాల్సి వస్తుంది. అటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో వారంతా అక్కడి నుంచే ఓటు వినియోగించుకునే అవకాశం వచ్చింది
*తెలంగాణలోని అన్ని కేంద్ర జీఎస్టీ కార్యాలయాలు శని, ఆదివారం కూడా పనిచేస్తాయని హైదరాబాద్‌ జోన్‌ జీఎస్టీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ బంకి బేహార్‌ ఆగ్రావాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌, సేవా పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటును అందించేందుకు ఆయా రోజుల్లో జీఎస్టీ కార్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు.
*పదోతరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్‌, ముగ్గురు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఒక శాఖాధికారిని విధుల నుంచి తప్పించామని, ముగ్గురు ఇన్విజిలేటర్లను సస్పెండ్‌ చేశామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సోషల్‌స్టడీస్‌ పేపర్‌-2 పరీక్షకు 99.59% హాజరు నమోదైందని పేర్కొన్నారు. కాపీయింగ్‌కు పాల్పడుతూ హైదరాబాద్‌లో ఇద్దరు, నాగర్‌కర్నూలులో ఒకరు పట్టుబడ్డారని వివరించారు.
*తెలంగాణలోని అన్ని కేంద్ర జీఎస్టీ కార్యాలయాలు శని, ఆదివారం కూడా పనిచేస్తాయని హైదరాబాద్‌ జోన్‌ జీఎస్టీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ బంకి బేహార్‌ ఆగ్రావాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌, సేవా పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటును అందించేందుకు ఆయా రోజుల్లో జీఎస్టీ కార్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు.
*ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉన్న ప్రగతి భవన్‌లో ఈ ఏడాది ఉగాది వేడుకలను జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ముఖ్యమంత్రి నివాస కార్యాలయం మినహా మరెక్కడైనా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను జరుపుకోవచ్చని సూచించింది. ఉగాది వేడుకలు జరిగే ప్రదేశాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సంపూర్ణంగా అమలు జరిగేటట్లు చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి స్పష్టం చేసింది.
*ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌) పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట రైల్వేస్టేషన్‌కు సమాచారం పంపింది.
*అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలోని పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్‌ నేటి(శనివారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 20న మెట్రో ప్రారంభించినా సాంకేతిక కారణాలతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్‌ ప్రారంభాలను వాయిదా వేశారు. దీంతో ఇక్కడ మెట్రో ఆగడం లేదు. శనివారం నుంచి పెద్దమ్మగుడి స్టేషన్‌ అందుబాటులోకి వస్తుందని మెట్రో వర్గాలు తెలిపాయి. దశలవారీగా మిగతాస్టేషన్లను ప్రారంభిస్తామని వెల్లడించాయి.
* ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ అనే నినాదంతో 31వ తేదీన దివ్యాంగ ఓటర్ల అవగాహన ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పలువురు దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్‌ శైలజ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే ర్యాలీ లక్ష్యమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
* రాష్ట్ర నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. నిఘా విభాగంలో తన తర్వాత సీనియర్‌గా ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. అనంతరం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఈ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాధ్యతలు అప్పగించరాదని డీజీపీని ఆదేశించింది.
*మా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను ఒక పౌరుడిగా గౌరవిస్తూనే, న్యాయం కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించాం. అన్నారు. ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆయన అగస్త్య మంజుతో కలిసి నిర్మించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో రాంగోపాల్ వర్మ విలేకరులతో మాట్లాడారు. సెన్సార్ బోర్డు ద్రువేకరణ పత్రం ఇచ్చాక ఓ సినిమా ఒక రాష్ట్రంలో విడుదలై మరో రాష్ట్రంలో నిలిచిపోవడం ఇదే తొలిసారి త్వరలో ఆంధ్రప్రదేశ్లో నూ చోత్రం విడుదలకు మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు వర్మ.
*మిలమిల మెరుస్తున్న ఈ బుజ్జి కప్పు పేరు పంప్కిన్ తోడ్లేట్ బ్రెజిల్ లోని అట్లాంటిక్ అడవి దీని పుట్టినిల్లు అతినీల కాంతి సమక్షంలో ఈ కప్పలు వెలుగులీనుతున్నట్లు యూఏఈలోని న్యూయార్క్ వర్సిటీ అబుదాబీ పరంగాన పరిశోధకులు గుర్తించారు.
*పీవీ సింధు , కిదాంబీ శ్రీకాంత్ పారుపల్లి కశ్యప్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ కు దూసుకెళ్ళారు. 2017 చాంపియన్ సింధు మహిళల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్ లో 21-9, 22-20తో మియా బ్లీచ్ పెల్ట్ పై విజయం సాధించింది. ఇంకా త్వరగా మ్యాచ్ ను ముగించాల్సింది. ఫైనల్లో చోటు కోసం ఆమె హీ బింగ్ జీయావో తలపడనుంది.
*ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత యువ షూటర్లు మనబాకర్ సౌరబ్ చౌదరీ జోరు కొనసాగుతోంది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పదిహేడేళ్ళ మను స్వర్ణం సొంతం చేసుకుంది. అర్హత రౌండ్లలో 575 పాయింట్లతో రెండో స్థానం,లో నిలిచినా ఆమె పతక పోరులో 239పాయింటుతో పసిడి దక్కించుకుంది.
*ఓటు వేయడం పౌరుల బాద్యత అంటూ అధికారులు ప్రచారాలు చేస్తున్నారు. ఆ బాద్యతను నెరవేర్చే క్రమంలో పజలకు అందించాల్సిన సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు తంగా గోరుకల్లు గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం. గతంలో పంచాయతీ నుంచి తండా మూడు కిమీ దూరంలో ఉండేది. ప్రభుత్వం పంచాయతీ కేంద్రానికి, తండాకు మధ్య గోరుకల్లు జలాశయం నిర్మించి తండా వాసులకు కర్నూలు జాతీయ రహదారికి పక్కన పునరావాసం కల్పించింది. ఎన్నికలో ఓటు వేసేందుకు వారంతా పాణ్యం మీదుగా గోరుకల్లు గ్రామానికి వస్తున్నారు. సుమారు 350 మంది తమ ఓటు హక్కు వినియోగించేందుకు పద్నాలుగు కిమీలు ప్రయాణించాల్సి వస్తోంది. తమకు అందుబాటులో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనీ కోరినా అధికారుల నుంచి స్పందన లేదు.
* శేషాచలం అడవుల్లో మంటలు భారీగా వ్యాపించాయి. గత రెండు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. చామలకోన, గాడికోన ప్రాంతాల్లో ఈ మంటలు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం నుంచి మంటలార్పేందుకు తితిదే అటవీ సిబ్బంది యత్నిస్తున్నారు. శ్రీవారి పాదాల వైపు అటవీప్రాంతంలో, రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో మంటలు వ్యాపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)