రాయపాటికి సీటు

నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు ఖరారైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారని రాయపాటి తనయుడు రంగారావు తెలిపారు. దీంతో గురువారం ఉదయం నుంచి చోటు చేసుకున్న హైడ్రామాకు తెరపడింది. నరసరావుపేట అభ్యర్థిపై 3 రోజులుగా అధిష్ఠానం కసరత్తు చేస్తున్నా ఎంపిక కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ పేరు తెరపైకి రావడంతో రాయపాటి అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ నేతలు సుజనా చౌదరి, టీడీ జనార్దన్‌, మంత్రులు పుల్లారావు, నారా లోకేశ్‌ విడివిడిగా ఆయనతో మాట్లాడి బుజ్జగించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీఎస్‌ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, ఎమ్మెల్సీ డొక్కా రాయపాటి వద్దకు వెళ్లి నరసరావుపేట లోక్‌సభ సీటు ఆయనకే ఖరారైందని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. అంతకుముందు గురువారం ఉదయం రాయపాటి ఇంటి వద్దకు కార్యకర్తలు చేరుకోగా వారితో ఆయన సమావేశమై సమాలోచనలు జరిపారు. పార్టీ మారాలని కార్యకర్తలు డిమాండు చేశారు. ఈలోగా పార్టీ నేతలు వచ్చి చర్చలు జరపడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయమై రాయపాటి రంగారావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ… లోక్‌సభ సీటు తన తండ్రికి ఖరారు చేయడంతోపాటు నరసరావుపేట శాసనసభ స్థానాన్ని తాము సూచించిన ఆరవిందబాబుకే ఇస్తామన్నారని తెలిపారు.

కర్ణాటక నుండి రాహుల్

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ సారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ పోటీ చేయనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడూ పోటీ చేసే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేథీతో పాటు ఈ సారి ఆయన కర్ణాటక నుంచి కూడా బరిలోకి దిగనున్నారని సమాచారం. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దక్షిణాది నుంచే ప్రారంభించడం ఈ వార్తలకు మరింత తావిస్తోంది. దక్షిణాది నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, కొందరు సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీని కోరారట. వీరి డిమాండ్లకు తలొగ్గిన రాహుల్‌ అందుకు అంగీకరించారట. కన్నడ రాష్ట్రంలో ఓ కీలక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారని సమాచారం. గతంలో సోనియా గాంధీ సైతం కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి సుష్మా స్వరాజ్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే వీటిపై ఇటు రాహుల్‌ గానీ, అటు కాంగ్రెస్‌ వర్గాలు గానీ స్పందించలేదు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!. 2019 లోక్‌ సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలోని 543 లోక్‌ సభ స్థానాలకు గానూ ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మాయావతి మార్గనిర్దేశం ముఖ్యం

మాయావతితో పవన్‌కల్యాణ్‌ భేటీ

బిఎస్సీ అధినేత్రి మాయావతితో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమావేశం అయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరిపినట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లుగా తెలియవచ్చింది.

అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని అన్నారు.

అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.

సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు.’

ఎన్నికలకు ప్రియాంక దూరం–తాజావార్తలు–03/13

*ఎన్నిరోజుల తరువాత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు చేపట్టి అన్న రాహూల్ గాంధీతో పాటు వివిధ పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ప్రియాంకా రాక పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే లోక్ సభ ఎన్నికల పట్ల ప్రియాంక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన స్టాట్యుటరీ నోటిఫికేషన్ల జారీకి కేంద్ర మంత్రి వర్గం బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 14లోని సబ్ సెక్షన్ (2) కింద ఈ నోటిఫికేషన్ల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ జారీతో 17వ ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందరిల్ 11తో ప్రారంభమై 7 విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని గత ఆదివారంనాడు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ ప్రకటించింది. మే 19వ తేదీతో ఆఖరి విడత పోలింగ్ ముగుస్తుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ 3వ తేదీతో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది.
* ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై సీఎం కేసీఆర్‌తో సబిత చర్చిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక సబిత వెంటే తామంతా ఉంటామని మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
* జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. యారీపోరా ఏరియాలో మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మిలిటెంట్ల రహస్య స్థావరాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ నివాసముంటున్న మహ్మద్ ఆయూబ్‌ను అరెస్టు చేశారు. ఆ స్థావరంలో ఉన్న ఆయుధాలు, బుల్లెట్లు, గ్రెనేడ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయూబ్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
* ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఈ సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా ఓటు హక్కు ఉన్నవారికి ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తున్నట్టు స్పష్టంచేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.తెలంగాణలోని మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌- కరీంనగర్‌ జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
* స్విట్జర్లాండ్‌ ఏంజెల్‌బర్గ్‌లోని టిట్లిస్‌ మంచు పర్వత అందాలకు ముగ్ధుడైన భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌.. సైనా నెహ్వాల్‌ తనతో లేకపోవడం వెలితిగా అనిపిస్తోందని అన్నాడు. స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నిర్వాహకులు మంగళవారం టిట్లిస్‌ పర్వతంపై ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించారు. మంచు పర్వతంపై ఏర్పాటు చేసిన కోర్టుపై కశ్యప్‌, సాయిప్రణీత్‌ కొద్దిసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు. అనంతరం కశ్యప్‌ మాట్లాడుతూ.. ‘‘టిట్లిస్‌ పర్వత అందాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం. నాతో ఇక్కడ సైనా లేకపోవడం వెలితిగా అనిపిస్తోంది. తను ఉంటే బాగా ఆస్వాదించేది. అనారోగ్యం కారణంగా సైనా స్వదేశం వెళ్లిపోయింది. తనకు కొన్ని ఫొటోలు పంపుతా. ఈ ఏడాది చివరికల్లా సైనాతో కలిసి ఇక్కడికి వస్తా. వరుస టోర్నీల కారణంగా మేము దాంపత్య జీవితాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ సమయం దొరకలేదు’’ అని కశ్యప్‌ తెలిపాడు. మంచు పర్వతంపై బ్యాడ్మింటన్‌ ఆడటం భిన్నమైన అనుభూతి అని సాయిప్రణీత్‌ చెప్పాడు.
* ధోని విమర్శకులపై స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మండిపడ్డాడు. 2019 ప్రపంచకప్‌లో భారత్‌కు అతడి సేవలు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. ‘‘ధోని గొప్ప ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. ఎలాంటి స్థితికైనా అతడు తనను తాను బాగా అన్వయించుకుంటాడు. ధోనీని విమర్శించే వాళ్లకు.. వాళ్లేమి మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు. ప్రపంచకప్‌లో భారత్‌కు అతడు అవసరం. అతడి అనుభవం, మైదానంలో కోహ్లీకి సహకరించడానికి అతడి నాయకత్వ నైపుణ్యం జట్టుకు అవసరం’’ అని వార్న్‌ చెప్పాడు. కోహ్లి మంచి కెప్టెనే అయినా.. ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని అనుభవం అతడికి అవసరమని అన్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌లు ఫేవరెట్లుగా ప్రపంచకప్‌లో అడుగుపెడుతున్నాయని వార్న్‌ చెప్పాడు. ఐతే ఆస్ట్రేలియానే కప్పు గెలవగలదన్న నమ్మకం అతడు వ్యక్తం చేశాడు.
*వధువు మేడలో వరుడు మూడుముళ్ళు వేయడం సాధారణంగా చూస్తుంటాం. అదే వరుడి మేడలో వధువు తాళి కట్టడం ఆశ్చర్యమే. ఇలాంటి ఆసక్తికర సన్నివేశం కర్నాటకలోని విజయపుర జిల్లా ముద్దేబీహాల్ తాలూకా నాలతా వాడ గ్రామంలో కనిపించింది. సోమవరం ఇక్కడ జరిగిన రెండు వివాహాల్లో వదువులే తాళి కట్టారు. వరుడు ప్రభురాజ్ కు మూడుముళ్ళు వేశారు. ఇదేమీ చోద్యమమ్మ అని ప్రశ్నించిన వారికి పన్నెండవ శతాబ్దంలో ఈ పద్దతే అమల్లో ఉండేదని దాన్నే మేమూ పునరుద్దరించమని సమాధానమిచ్చారు. ఇవి అసలుసిసలైన బసవన్న సిద్దాంతాలకు లోబడి జరిగిన వివాహాలని విమర్శకుల నోళ్ళు మూయిస్తున్నారట. ఈ వినూత్న వివాహ వేడుకలకు ఆద్యత్మికవేత్తలు ఇలకల్ గురు మహంతేష స్వామీ చిత్రదుర్గ బసవమూర్తి లింగాసూర్గు సిద్దలింగ స్వామీ తదితరులు హాజరయ్యారు.
*ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయ పరంగా పదింటిని ఖరీదైన నియోజకవర్గాలుగా నాలుగింటిని తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాలుగా గుర్తించగా వచ్చే ఎన్నికల్లో వాటిపై ప్రత్యేక నిఘా అవసరమని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఖరీదైన నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెద్ద మొత్తంలో నగదును ఖర్చు చేయటంతోపాటు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. భారీగానే నగదు పట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో తీవ్రవాదుల కదలికలు పెద్దగా లేకపోయినప్పటికీ సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంది. ముందుజాగ్రత్తగా ఆయా నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తు అవసరమని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
*‘గడిచిన 2014వ సంవత్సరంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల నియమావళి మేరకు వ్యవహరించని 62 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇందులో 45 మంది శాసనసభకు, 17 మంది లోక్‌సభకు పోటీ చేసిన వారు’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*భారత సరిహద్దుల వెంబడి పాకిస్థాన్‌ వైమానిక దళం, సైన్యం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి. ఎఫ్‌-16 యుద్ధవిమానాలతో కూడిన ఒక స్క్వాడ్రన్‌ను ఆ దేశం మోహరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. గగనతలంలో విధించిన ఆంక్షలనూ పాక్‌ కొనసాగిస్తున్నట్లు చెప్పాయి. పాకిస్థాన్‌ సైన్యంలోని రావల్పిండి కేంద్రంగా పనిచేసే 10 కోర్‌, సియాల్‌కోట్‌లోని స్పెషల్‌ ఫోర్సెస్‌ బ్రిగేడ్‌లు జమ్మూకశ్మీర్‌ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ వద్ద మోహరించాయని వివరించాయి.
*జమ్మూకశ్మీర్‌ శాసనసభ ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని అక్కడి అధికారులు, ప్రజలు చెబుతున్నా.. అదే రాష్ట్రంలో ఉన్న అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి ఏకంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడంలో మతలబు ఏమిటని మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. మంగళవారం బహదూర్‌పుర నియోజకవర్గంలో ఎంఐఎం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లో భాజపా వ్యక్తి గవర్నర్‌గా ఉండడం వల్లే ఒకేసారి ఎన్నికలు నిర్వహించకుండా మోదీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు మద్దతుగా జగన్‌ తరఫున ప్రచారం చేస్తానన్నారు. రంజాన్‌ మాసంలో ఎన్నికలు నిర్వహించడాన్ని కొందరు తప్పు బడుతున్నారని, తాము మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
*రామగుండంలో ఈ నెల 15న జరగనున్న పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ తెరాస పార్టీ సన్నాహక సమావేశాన్ని వాయిదా వేసినట్లు సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ నెల 17న కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ ఉన్న దృష్ట్యా రామగుండం సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 17న కరీంనగర్‌ బహిరంగ సభకు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులను ఈశ్వర్‌ కోరారు.
*టీపీసీసీ కార్యవర్గంలో మరికొంతమందికి అవకాశం కల్పిస్తూ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు- టీపీసీసీ కార్యదర్శులుగా బాస కృపానందం, ఏజెకైల్‌; సంయుక్త కార్యదర్శులుగా సాల్మన్‌ రాజు, బి.ఆరోగ్యయ్య నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా హెబెర్ట్‌ ఫ్రాన్సిస్‌ను నియమించారు.
* ‘ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందాలనే భావనతో తమ వంతు సహాయం చేసేందుకు ఎంతో మంది దాతలు, ప్రవాస తెలంగాణావాసులు సిద్ధంగా ఉన్నారు.. ఎలా సహాయం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? తదితర సమగ్ర వివరాలను తెలియజేస్తూ ఒక వెబ్‌సైట్‌ రూపొందించాలి’ అని విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. విశ్రాంత ఉపాధ్యాయులు, బోధనపై ఆసక్తి ఉన్న వారి సేవలను బడుల్లో ఉపయోగించుకోవాలన్నారు.
*ఇటీవల పోలీసు క్రీడల్లో పతకాలు సాధించిన, రాష్ట్రానికి చెందిన విజేతలను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లో వీరంతా డీజీపీని కలిశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 12వ అఖిలభారత షూటింగ్‌ పోటీల్లో 50 మీటర్ల పాయింట్‌ 22 రైఫిల్‌ విభాగంలో వరంగల్‌లోని సుబేదారీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా ఏఎస్సై వి.సువర్ణ, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.విజయమ్మ, నిజామాబాద్‌ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వుకు చెందిన సీహెచ్‌.మాధవి బృందం బంగారు పతకం సాధించింది.
*భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆర్‌ఎల్‌ మూర్తి ఎన్నికయ్యారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(జి) గ్రామానికి చెందిన మూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆయన్ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్‌ తెలిపారు.
*మాజీ సైనికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. అవసరమైతే నిబంధనలను సడలించి వారికి సాయం చేయాలని ఆదేశించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో మాజీ సైనికుల సంక్షేమ, పునరావాసానికి సంబంధించి ప్రత్యేక నిధి కమిటీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
*కృష్ణా జలాల్లో అవసరమైన నీటి వాటా కేటాయింపుపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 14న కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
*వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 94 వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 1నుంచి జూన్‌ 29 మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
*రాష్ట్రంలో మంగళవారం మూడు జిల్లాల్లో గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. నిర్మల్‌ జిల్లా పెంబి, సంగారెడ్డి జిల్లా అందోలు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లిజిల్లా రామగిరి మండలం కల్వచెర్లలో 39.8, గద్వాల జిల్లా ధరూరులో 39.7, నిజామాబాద్‌ జిల్లా బెల్లల్‌లో 39.6, నిర్మల్‌ జిల్లా వడ్యాలలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
*ఇంటర్మీడియట్‌ ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టామని వెల్లడించారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనం మార్చి 22వ తేదీలోపు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఇది షెడ్యూల్‌ ప్రకారం పూర్తయితే వచ్చే నెల 12న ఫలితాలు విడుదల చేయనున్నారు.
* ‘రోగులకు మెరుగైన, స్నేహపూర్వక వైద్యసేవలను అందిస్తాం. అందరికీ ఆరోగ్యం ద్వారా హ్యాపీ కమ్యూనిటీగా తీర్చిదిద్దేందుకు మంగళగిరి ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డా.టీఎస్‌.రవికుమార్‌ పేర్కొన్నారు.
*వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్రపునేఠ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వేసవి కార్యాచరణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ పునేఠ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
*మాజీ సైనికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. అవసరమైతే నిబంధనలను సడలించి వారికి సాయం చేయాలని ఆదేశించారు.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల జుడిషియల్‌ అకాడమీ పేరును మార్చారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014, సెక్షన్‌ 75ను అనుసరించి ‘‘తెలంగాణ రాష్ట్ర జుడిషియల్‌ అకాడమీ’’గా పేరు మారుస్తూ మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
*వివిధ పత్రికలు, మాధ్యమాలు, సోషల్‌ మీడియాల్లో వచ్చే చెల్లింపు వార్తల(పెయిడ్‌ ఆర్టికల్స్‌) పరిశీలనకు రాష్ట్రస్థాయి మీడియా పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా అదనపు సీఈవో వివేక్‌ యాదవ్‌, సభ్యులుగా జాయింట్‌ సీఈవో మార్కండేయులు, దూరదర్శన్‌ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌, సమాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.*
*ఈ నెల 31వ తేదీన జరగాల్సిన గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేసే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. కమిషన్‌ తొలుత ప్రకటించిన ప్రకారం ఈ నెల 10వ తేదీన ప్రిలిమ్స్‌ జరగాల్సి ఉంది.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవోగా నియమితులైన ఆర్జా శ్రీకాంత్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనకు మరింత బాధ్యత పెరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అమలు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
*రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమైంది. గతేడాది 18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఆ సంస్థ ఇప్పుడు 22.5లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
* ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ యువతకు భృతి చెల్లింపుల కోసం రూ.40 కోట్ల అదనపు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు యువజనాభ్యుదయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
*రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమైంది. గతేడాది 18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఆ సంస్థ ఇప్పుడు 22.5లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ వివరాలను ఆ సంస్థ ఎండీ ఎ.సూర్యకుమారి మంగళవారం ప్రకటించారు.
*విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌(చెన్నుబోయిన శ్రీనివాస్‌)కు చెందిన ఆస్తిని చట్ట పరిధిలో స్వాధీనం చేసుకున్నట్లు కెనరా బ్యాంక్‌ పత్రికాముఖంగా స్వాధీనత ప్రకటన విడుదల చేసింది. మెస్సర్స్‌ ఐమాక్స్‌ ట్రేడర్స్‌ భాగస్వాములైన వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎల్‌.శ్రీలక్ష్మీ.. కెనరా బ్యాంక్‌కు రూ.3.19 కోట్ల మేర బకాయిలు పడ్డారు. దీనిపై 2018 జనవరి 3న కెనరా బ్యాంక్‌ సిరిపురం బ్రాంచి రుణగ్రహీతలకు నోటీసులు జారీ చేసింది. రుణగ్రహీతలు, హామీదారులు సదరు బకాయి సొమ్మును చెల్లించటంలో విఫలమైనందున వంశీకృష్ణ శ్రీనివాస్‌కు చెందిన శివాజీపాలెంలోని సర్వే నంబరు 40/1లోని 281 గజాల స్థలం(నంబరు 128) స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కెనరా బ్యాంక్‌ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
*పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ మరుసటి రోజు ఏప్రిల్‌ 12వ తేదీన పాఠశాలల విధులకు హాజరు కాలేని పక్షంలో ఉపాధ్యాయుల గైర్హాజరును ఆన్‌ డ్యూటీగా పరిగణించేటట్లు డీఈవోలకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను యూటీఎఫ్‌ కోరింది. ఈ మేరకు మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.రాములు, ప్రధాన కార్యదర్శి చావ రవి వినతిపత్రం అందజేశారు. ఈనెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని కోరారు.
*కృష్ణా జలాల్లో అవసరమైన నీటి వాటా కేటాయింపుపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 14న కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ జలసౌధలోని బోర్డు కార్యాలయంలో ఆ రోజు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)లతో సమావేశం నిర్వహించనున్నారు. తాగునీటి అవసరాలకు 17 టీఎంసీలు అవసరమని ఈ నెల ఆరోతేదీన ఏపీ కేఆర్‌ఎంబీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు అనువుగా.. రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు నీటి వినియోగ సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఇన్‌ఛార్జి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా కోరారు.

ఏపీకి మళ్ళీ రానున్న ప్రధాని

భాజపా జాతీయ స్థాయి అగ్ర నేతలు రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఏప్రిల్‌ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రచార నిమిత్తం ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇతర సీనియర్‌ నేతలు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ తిరుపతి, కర్నూలు, విజయనగరం జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. గుంటూరు, విశాఖ నగరాల్లో మోదీ సభలు విజయవంతమైనందున ఆయన రాష్ట్ర పర్యటనకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. అమిత్‌షా కూడా మరో మూడు సభల్లో పాల్గొంటారని పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నాయకులకు సంకేతాలు అందాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రులు నిర్మలా సీతారామన్‌, జుయల్‌ ఓరమ్‌, స్మృతి ఇరానీ, తదితరులు రాష్ట్ర పర్యటనకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తేదీల ఖరారుకు ఇంకొంత సమయం పట్టనుంది. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత నెలలో ప్రారంభించిన బస్సు యాత్ర సమయంలో ప్రతి జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కేంద్ర మంత్రులు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. రాష్ట్రం నుంచి ఒంటరిగా పోటీ చేయబోతున్న భాజపా అభ్యర్థులకు జాతీయ నాయకుల ప్రచారమే కీలకం కానుంది. మరోవంక.. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా ఖరారుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బృందం ఒకట్రెండు రోజుల్లో దిల్లీ వెళ్లనుంది.

కొచ్చర్ భర్త చుట్టూ గట్టి ఉచ్చు

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు మరో తలనొప్పి మొదలైంది. తన భర్త దీపక్‌ కొచ్చర్‌ పై త్వరలోనే ఆదాయపన్ను అధికారులు బినామీ వ్యవహారాల వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించనున్నారు. గతంలో పన్ను ఎగవేతకు సంబంధించి చేసిన దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడంతో బినామీ వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు. గత ఏడాది విచారణ సందర్భంగా దీపక్‌కొచ్చర్‌ను సింగపూర్‌కు చెందిన కంపెనీ ఏడీఎస్ఎఫ్‌ తన సబ్సిడరీ డీహెచ్‌ రెనీవబుల్‌ హోల్డింగ్స్‌ ద్వారా పెట్టిన రూ.405 కోట్ల పెట్టుబడులపై వివరాలు ఇచ్చారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. మనీలాండరింగ్‌, నగదును వేర్వేరు మార్గాల్లో కంపెనీలోకి తీసుకొచ్చినట్లు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నివేదికను ఈడీతో పంచుకొన్నారు. ఆదాయపుపన్ను శాఖ గత ఏడాది ఏప్రిల్‌ 10న దీపక్‌ కొచ్చర్‌కు నోటీసులు జారీ చేసింది. నూపవర్‌లో పెట్టుబడులు పెట్టిన ఏడీఎస్ఎఫ్‌ సబ్సిడరీ కంపెనీల గురించి విచారించారు. ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టిన సొమ్మకు మూలాలను అధికారులు ప్రశ్నించారు. ఈ రెండు సంస్థలు అత్యధిక ప్రీమియంతో నూపవర్‌లో వాటాలను కొనుగోలు చేశాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఐటీ శాఖ సింగపూర్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. సాధారణంగా నిధుల బదలాయింపు కోసమే ఉద్దేశపూర్వకంగా అధిక ప్రీమియం చెల్లించి వాటాలు కొనుగోలు చేసినట్లు ఐటీశాఖ నమ్ముతోంది. దీంతో ఏడీఎస్ఎఫ్‌కు చెందిన వార్షిక నివేదిక, బ్యాలెన్స్‌ షీట్‌, పన్ను వివరాలు, ప్రమోటర్లు, వాటాదారులు వివరాలను , మారిన షేర్‌ హోల్డింగ్‌ ప్యాట్రన్‌ను వెల్లడించాలని కోరింది.

మోడీ నీడలో బాగా ఎదిగిన ధనవంతులు

2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది వరకు దేశంలో సంపద బాగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమయింది. ఈ ఐదేళ్లలో ఏడాదిన్నర మినహాయిస్తే జీడీపీ వృద్ధిరేటు ఏడుశాతానికిపైగా నమోదయింది. దీంతో సంపన్నుల ఆదాయాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. సామాన్యుడి తలసరి ఆదాయం మాత్రం 58 శాతం పెరిగింది. ఇదే కాలంలో మనదేశ ప్రజల తలసరి ఆదాయం రూ.68,572 నుం చి రూ.1.25 లక్షల దాకా పెరిగింది. సంపన్నుల ఆదాయాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఫోర్బ్స్‌ పత్రిక జాబితా ప్రకారం.. మనదేశంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్‌‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపద 2014లో 23 బిలియన్ డాలర్లు (దాదాపు 1.60 లక్షల కోట్లు) కాగా 2019లో ఇది 50 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.49 లక్షల కోట్లు) చేరింది. అంటే మూడురెట్లు పెరిగిందన్న మాట. రెండో స్థానంలో ఉన్న విప్రో అధిపతి అజీమ్‌ ప్రేమ్‌ జీ సంపాదన 16.4 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్‌‌ డాలర్లకు ఎగిసింది. మూడోస్థానంలో ఉన్న హెచ్‌ సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ సంపాదన 12.5 బిలియన్ డాలర్ల నుం చి 14.6 బిలియన్‌‌ డాలర్లకు చేరింది. నాలుగో ర్యాంకు దక్కించుకున్న అంతర్జాతీయ స్టీల్‌ కంపెనీ అర్సెలర్‌ మిట్టల్‌ సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ ఆర్జన 15.8 బిలియన్ డాలర్ల నుంచి 18.3 బిలియన్‌‌ డాలర్లకు ఎగిసింది. 2014లో ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించు కోలేకపోయిన కోటక్‌‌ బ్యాంకు ఎండీ ఉదయ్‌ కోటక్‌‌ ఈసారి 11.8 బిలియన్ల సంపాదనతో ఐదో ర్యాంకుకి వచ్చారు. 2014లో ఈయన నెట్‌ వర్త్‌‌ 6.1 బిలియన్‌‌ డాలర్లుగా తేలింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌‌ చైర్మన్‌‌ కుమార మంగళం బిర్లా 11.1 బిలియన్ల సంపాదనతో ఆరో ర్యాంకుకు వచ్చారు. 2014లో ఆయన నెట్‌ వర్త్‌‌ 9.2 బిలియన్లు! బిర్లా మాదిరే డిమార్ట్‌‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకృష్ణ దమానియా 2014లో ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకోకున్నా ఈ ఏడాది మాత్రం 11.1 బిలియన్ల సంపాదనతో ఏడో ర్యాంకు పొందారు. ఐదేళ్ల క్రితం ఈయన నెట్‌ వర్త్‌‌ బిలియన్‌‌ డాలర్లు మాత్రమే. సీరమ్‌ ఇన్‌‌స్టి ట్యూట్‌ అధిపతి సైరస్‌ పూణావాలా సంపాదన 6.2 బిలియన్‌‌ డాలర్ల నుంచి 9.5 బిలియన్లకు చేరింది. ఈయన ఎనిమిదో ర్యాంకులోకి వచ్చారు. ఎన్నో వ్యాపారాలు చేసే గౌతమ్‌ ఆదానీ సంపాదన 7.1 బిలియన్ల నుంచి 8.7 బిలియన్లకు చేరింది. ఈయన తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు. పదో ర్యాంకులో నిలిచిన దిలీప్‌‌ సంఘ్వి ఫార్మా దిగ్గజం. 2014లో ఈయన నెట్‌ వర్త్‌‌ 18 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది ఇది 7.6 బిలియన్‌‌ డాలర్లకు పడిపోయింది. ఈ లెక్కలను గమనిస్తే ఒకరిద్దరిని మినహాయిస్తే టాప్‌‌ టెన్‌‌ ధనికుల సంపాదన ఈ ఐదేళ్లలో కనీసం కనీసం 75 శాతం పెరిగింది. చాలా మంది ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఇండియాలో సంపదపై ఆక్స్ ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దీని నివేదిక ప్రకారం భారతదేశంలోని సంపదలో ఎక్కువ భాగం కేవలం ఒక్క శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. రూపాయిలో 73 పైసలు.. కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉన్నా యి. అంటే మిగిలిన 27శాతం డబ్బు.. 99 శాతం మంది పంచుకుంటున్నా రు. దేశంలోని 99 శాతం మంది జనం.. కేవలం 27శాతం డబ్బుతో బతికేస్తున్నా రు. వీళ్లందరూ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అరకొర సంపాదనతో బతుకు బండి లాగుతున్నారు. భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నా యనడానికి ఈ లెక్కలే నిదర్శనం అని ఆక్స్ ఫామ్ సర్వే వెల్లడించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. 67 కోట్ల మంది భారతీయుల సంపద గత రెండేళ్లలో పెరిగింది కేవలం ఒక్క శాతం మాత్రమే! అంటే అంటే వెయ్యికి .. 10 రూపాయలు పెరిగింది వీరి సంపాదన. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం ధనివంతులైన కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. అంటే 370 కోట్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏ మాత్రం అభివృద్ధి లేదు. ధనికులు మరింత ధనవంతులవుతుండగా.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని సర్వేలో తేలింది.

నాన్నా జానా…లోక్ సభకు వెళ్తావా?

కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో సీనియర్‌లను బరిలో దింపడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 లోపు రాష్ట్రంలో అభ్యర్థులను జాబితాను ఖరారు చేయాలని నిర్ణయించింది. పార్టీ సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, రేణుకా చౌదరి, డి.కె.అరుణ సహా మరికొందరు నేతలపై తాజాగా చర్చిస్తోంది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు, పీసీసీ ఎన్నికల కమిటీ రూపొందించిన అభ్యర్థుల జాబితా ఉండగా దానికి సీనియర్ల పేర్లను కూడా చేర్చి అధిష్ఠానం పరిశీలిస్తోంది. శాసనసభ ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఫలితాలు ఉంటాయని భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉంది. అభ్యర్థుల జాబితాపై బుధవారం ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ తుది కసరత్తు చేయనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో బాటు పీసీసీ ముఖ్యనేతలు మంగళవారం రాత్రి దిల్లీకి చేరుకోనున్నారు. 13 లేదా 15 లోపు 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ ముఖ్యనేతలు తెలిపారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది.

రాష్ట్రపతి భవనంలో పద్మ అవార్డుల సందడి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2001లో మోహన్‌లాల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మోహన్‌లాల్‌ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ తాజాగా పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవాకు పద్మశ్రీ వరించింది. నాట్య రంగంలో తన అమోఘమైన ప్రతిభను కనబరిచినందుకుగానూ ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది. ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన డ్యాన్సింగ్‌ స్టయిల్స్‌ను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాదాపు 13 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.

వేట ఇంకా వేటాడుతోంది

సినీ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్‌ అలీ ఖాన్‌, దుష్యంత్‌ సింగ్‌, నీలమ్‌ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ హైకోర్టు సమన్లు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణజింకలను వేటాడారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన తీర్పును గతేడాది జోధ్‌పూర్‌ న్యాయస్థానం వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే.. ఈ కేసులో సల్మాన్‌తో పాటు వారిది కూడా సమాన తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం వారికి సమన్లు జారీ చేసింది. మరోపక్క సల్మాన్‌కు శిక్షపడిన తర్వాత రెండు రోజుల పాటు ఆయన జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ఒరిస్సాలో వెల్లివిరియనున్న మహిళా సాధికారత

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ తమ బీజూ జనతా దళ్‌ (బీజేడీ) పార్టీ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ఆదివారం ప్రకటన చేశారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎస్‌హెచ్‌జీ) సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘లెజెండరీ బీజూ బాబు (ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్‌) కర్మ భూమి అయిన ఈ కేంద్రాపఢా నుంచి నేను ఓ విషయంపై ప్రకటన చేస్తున్నాను. ఒడిశా నుంచి పార్లమెంటుకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలు వెళ్తారు’ అని తెలిపారు. ‘భారత్‌లో మహిళలు సాధికారత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారు. ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా అందుకు మహిళా సాధికారతే మార్గం. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడి, ఆ దిశగా అడుగులు వేయాలి’ అని నవీన్‌ పట్నాయక్‌ వ్యాఖ్యానించారు. మహిళల కోసం నిర్మిస్తున్న మిషన్‌ శక్తి భవనం కోసం ఆయన రూ.కోటి మంజూరు చేశారు. కాగా, మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబరులో ఒడిశా అసెంబ్లీలో ఆయన ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదింప చేశారు. దీనికి భాజపా, కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలోనే ఈ ప్రతిపాదన చేశారని విమర్శలు కూడా చేశాయి.

ఈసారి అభ్యర్థుల సామాజిక ఖాతాలు కూడా ఎన్నికల కోడ్ కిందకి

మోగింది ఎన్నికల నగారా

?????????

✍17వ.సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్

✍నేటి నుంచే దేశంలో ఎన్నికల కోడ్

✍7దశల్లో ఎన్నికలు

✍స్వేచ్ఛయుత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశాము

✍2014 సం,, తర్వాతకొత్తగా వచ్చిన ఓటర్లు : 8కోట్ల 40లక్షల మంది

✍దేశంలో సుమారు 10 లక్షల పోలింగ్ కేంద్రాలు

✍పరీక్షలు, పండుగలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది

✍తొలిసారిగా EVM లపై అభ్యర్థుల ఫోటోలు

✍ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర పత్రికలలో, ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి

✍ఫోటో ఓటర్ స్లీప్ గుర్తింపు కార్డు గా పరిగణనలోకి తీసుకోవడం జరగదు

✍దేశ వ్యాప్తంగా 90 కోట్ల ఓటర్లు

✍ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్: 1950

✍అభ్యర్థుల సోసియల్ మీడియా అకౌంట్లు కి ఎన్నికల నియమాలను వర్తింపు

✍99.36% ఓటర్లుకు గుర్తింపు కార్డులు ఉన్నాయి

✍ఏప్రిల్ 11 మొదటి దశ ఎలక్షన్

✍ఏప్రిల్ 18 రెండవ విడత ఎలక్షన్

✍ఏప్రిల్ 23 మూడవ విడత

✍ఏప్రిల్ 29నాల్గవ విడత ఎలక్షన్

✍మే 6 ఐదవ విడత ఎలక్షన్

✍మే 12 ఆరవ విడత ఎలక్షన్

✍మే 19 ఏడవ విడత ఎలక్షన్

✍మే 23 ఎన్నికల ఫలితాలు

✍ఒకే విడతలో తెలంగాణ & ఆంద్రప్రదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలు

✍ఆంద్రప్రదేశ్ లోని 25 లోక్ సభా & 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11 న ఓటింగ్

✍22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్

✍తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ కి ఒక నెల మాత్రమే వ్యవధి

-ప్రధాన ఎన్నికల కమిషన్,

– అరోరా

అసత్యాలు తొలిగాక అసలు చూపిస్తా

తాను త్వరలోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయనేలా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా ఇటీవల పలుసార్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలుసార్లు ఫేస్‌బుక్‌ ద్వారా కూడా స్పందించారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనకు సంబంధించిన పోస్టర్లను కూడా ముద్రింపజేసి ప్రచారం చేస్తుండడంతో ఈ విషయంపై వాద్రా మరోసారి స్పందించారు. ఈ పోస్టర్లను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ కార్యకర్తలు చూపుతున్న అభిమానానికి హర్షం వ్యక్తం చేశారు. అతిపెద్ద వేదిక పై నుంచి తాను ప్రజలకు సేవచేయాలనుకుంటున్నానని, అయితే, తనపై ఉన్న అసత్య ఆరోపణలు తొలిగిపోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘తమ ప్రాంతం నుంచే నేను పోటీ చేయాలని కోరుతూ మన దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు నాపై చూపుతున్న ఆదరాభిమానాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నాను. మార్పు కోసం తమ ప్రాంతం నుంచే నేను ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు భావిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో కలిసి పార్టీ ప్రచారంలో నేను అంకిత భావంతో పనిచేశాను. ఆయా గ్రామాల్లోని ప్రజల నిరాబండర జీవితాన్ని, వారు చూపే ప్రేమను చూశాను. వారి నుంచి పలు విషయాలు తెలుసుకున్నాను. వారి సమస్యల పరిష్కారం కోసం అవి ఉపయోగపడతాయి. నేను చాలా కాలంగా ప్రజా సేవలో ఉన్నాను. ఇప్పుడు అతిపెద్ద వేదిక (రాజకీయ రంగం) పై నుంచి నేను ప్రజలను సేవ చేయాలనుకుంటున్నాను. కానీ, నాపై ఉన్న అన్ని అసత్య ఆరోపణలు తొలగిపోయిన తరువాతే ఈ రంగంలోకి రావాలనుకుంటున్నాను. సత్యం ఏదో తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. మార్పు కోసం, దేశ అభివృద్ధి కోసం పని చేయడంలో భాగస్వామి అవుతాను’’ అని వాద్రా తెలిపారు. కాగా, ఆయనపై మనీలాండరింగ్‌ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమీషనర్ల సునీల్ అరోరా ప్రసంగం

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌పై వివరాలను వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ  స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాలు, ప్రభుత్వాలతో పలు దఫాలుగా సన్నాహక సమావేశాలు జరిపామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై చర్చలు జరిపామని ఆయన చెప్పారు. నిష్పక్ష, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు అరోడా వివరించారు. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షల దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా తాగునీరు, టాయ్‌లెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని అరోడా వివరించారు. ‘‘పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు పోల్‌ చిట్టీలను పంపిణీ చేస్తాం. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ నిర్వహిస్తాం’’ అని అరోడా వివరించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్‌ ఆరోరా తెలిపారు. 17వ లోక్‌సభ ఎన్నికలకు సుదీర్ఘ కసరత్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేసేముందు  అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మీడియ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు, పండుగలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఆయన ప‍్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ దిక్సూచిగా ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2014 నుంచి ఇప్పటివరకూ 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు అయినట్లు చెప్పారు. ఓటర్‌ సిప్ల్‌లు ఎన్నికలు అయిదు రోజులకు ముందే పంపిణీ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10  లక్షల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశామని, అలాగే 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఓటు చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వీవీ ప్యాట్‌లు ఉపయోగిస్తామన్నారు. తుది జాబితా ప్రకటించాక ఓటర్ల జాబితాలో ఇక మార్పులుండని, దేశవ్యాప్తంగా ఎన్నికల కోట్‌ నేటి నుంచి అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఓటర్‌ కార్డుతో పాటు 11 రకాల కార్డులకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించి నిఘా కోసం ఎస్పీలు, కలెక్టర్లతో సదస్సులు నిర్వహిస్తామని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు విద్యార్థుల పరీక్షలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎన్నికల తేదీలు నిర్ణయించడానికి ముందు వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్నామన్నారు.

మోడీ టెర్రరిస్టులా భయపెడుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార తార విజయశాంతి ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను రక్షించాల్సింది పోయి భయపెడుతున్నారని ఆరోపించారు. రానున్న లోకసభ ఎన్నికలు కాంగ్రెస్‌-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. మోదీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని దేశ ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మోదీని గద్దె దింపాలని విజయశాంతి పిలుపునిచ్చారు. కాగా ఇదే సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. మోదీ, కేసీఆర్‌ కుమ్మకైయ్యారని విజయశాంతి ఆరోపించారు.

అమలులోకి ఎన్నికల కోడ్. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ.

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 543 ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. 17వ లోక్‌సభకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

రూ.500 కోట్లు చెల్లింపులు

రానున్న జాతీయ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టడానికి సామ్ బల్సారా నేతృత్వంలోని మాడిషన్ మీడియాను భాజపా పునః నియమించుకుంది. ప్రింట్, డిజిటల్, టీవీ, రేడియోలో సహా భాజపా తరపున అన్ని రకాలుగా ప్రచారం చేయడానికిగానూ ఈ సంస్థకు రూ.500 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ భాజపా తరపున ఈ మీడియా దిగ్గజం ప్రచార బాధ్యతలను ఒగిల్వి, మేధార్ అనే మరొ కంపెనీకి సైతం అప్పగించారు. ఈ కంపెనీ అధినేత పియూష్ పాండే 2014లో రూపొందించిన నినాదం ఆబ్ కి బార్ మోడీ సర్కార్ (ఈసారి మోడీ సర్కార్ వంతూ) జనసామాన్యంలోకి బాగా చొచ్చుకుపోయింది.

అస్సాం ఎంపీగా తెలుగు వ్యక్తి పోటీ

అసోంలోని తేజ్‌పూర్‌ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టుపై పోటీ చేయడానికి పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎంజీవీకె భాను రేసులో ఉన్నారు. అసోంలో వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. తేజ్‌పూర్‌ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పథకాలను అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే భాను స్థానికులను కలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి భాజపా ఎంపీ ఆర్‌పీ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1985వ బ్యాచ్‌కు చెందిన భాను పీవీ నరసింహరావు ప్రభుత్వంలో కేంద్ర టెలికమ్యూనికేషన్‌ మంత్రిగా పనిచేసిన పీవీ రంగయ్యనాయుడు అల్లుడు.

సుప్రీం కోర్టుకు తిక్క రేగింది. హరియాణా ప్రభుత్వానికి హెచ్చరిక అందింది.

ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఆరావళి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతినిస్తూ హరియాణా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నిర్మాణాల వల్ల పర్వతాలకు హాని కలిగితే మాత్రం మీరు(రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) సమస్యల్లో చిక్కుకున్నట్లేనని హెచ్చరికలు చేసింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌కు అనుమతినిచ్చేలా హరియాణా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. ప్రతిపక్షాల నుంచి నిరసనలు వచ్చినప్పటికీ.. ఈ సవరణలకు ఫిబ్రవరి 27న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రియల్టర్లకు ప్రయోజనాలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందంటూ పిటిషన్‌దారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరియాణా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా చట్టాన్ని అమలు చేయరాదంటూ ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నేడు మరోసారి విచారణ జరిగింది. ‘ఆరావళి పర్వత శ్రేణుల గురించి మేం ఆలోచిస్తున్నాం. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మీకు చెప్పేది ఒక్కటే.. ఆరావళికి, అటవీ ప్రాంతానికి నష్టం కలిగించేలా చర్యలు చేపడితే మీరు సమస్యల్లో పడతారు’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌ మొదటివారానికి వాయిదా వేసింది.

కమల్ పార్టీలో జేరిన కోవై

ప్రముఖ హస్య నటి కోవై సరళ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె కమల్ స్థాపించిన “మక్కల్ నీది మయ్యం” పార్టీలో చేరారు. చైన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కమల్ హాసన్ కోవై సరళను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్‌హసన్ ఆమె సేవలు పార్టీకి చాలా అవసరమన్నారు. కోవై సరళ ‌ చేరికతో కోయంబత్తూరు ప్రాంతంలో పార్టీకి కొంత బలాన్ని ఇస్లుందని కమల్ అభిప్రాయపడుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న కమల్‌కు ఈ అంశం కొంత లాభిస్తుంది.గతంలో రాజకీయ అరంగేట్రం చేయడానికి కోవై సరళ ప్రయత్నించినప్పటికీ పలు కారణాల వలన అది సాధ్య పడలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమె రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. చిరకాల మిత్రుడు, సహ నటుడైన కమల్ హాసన్‌కు మద్దతు తెలిపారు. గురువారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఎంఎన్ఎం పార్టీ కండువా కంపుకున్నారు. పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు తాను సిద్దమన్నారు. కోవై సరళ మంచి వక్త, ఇనాళ్ళు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సరళ ఇప్పడు రాజకీయ ప్రసంగాలతో ఏమాత్రం ప్రజలను ఆకట్టుకుంటారో చూడాలి.

10న ఏపీ మంత్రివర్గ సమావేశం-తాజావార్తలు–03/08

* అమరావతి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రస్తుతం నడుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చతోపాటు భూకేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంటారు.
* అందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి తెచ్చారు- శివాజీ
తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ అన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. డేటా చోరీ అంశంపై శివాజీ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
* కుప్పకూలిన మిగ్‌-21 యుద్ధ విమానం
భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా.. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.సాధారణ శిక్షణ నిమిత్తం బికనేర్‌ సమీపంలోని నాల్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయల్దేరిన మిగ్‌-21 విమానం కాసేపటికే కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ విమాన పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డారని బికనేర్‌ ఎస్పీ తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
* మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ ఫోన్ పి స్మార్ట్ ప్ల‌స్ 2019 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.21,880 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో లభ్యం కానుంది. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.
* తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలంమేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలంనిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌ వ్యవస్థీకరించి మొస్రాచండూరు అనే కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్‌ దాసరి వెంకట బాలవర్థన్‌ రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో దాసరి బాలవర్థన్‌ రావు ఇవాళ ఉదయం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాలవర్థన్‌ రావుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్‌ రావు సోదరుడు దాసరి జై రమేష్‌ పాల్గొిన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్‌…వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా దాసరి బాలవర్ధన్‌ రావు మాట్లాడుతూ… గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్‌ కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్‌ రావు పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు.
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పన్నెండు అంతర్జాతీయ, నలభైకు పైగా దేశీయ విమానాలను పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడుపుతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మహిళా సాధికారతను చాటేలా పైలెట్లు కూడా మహిళలే ఉంటారని తెలిపింది.
* టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్‌ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్‌ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించరాదని టీవీ 5కి కూడా సూచించింది. అంతేకాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రెస్‌మీట్లకు, పార్టీ కార్యక్రమాలకు టీవీ 5ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది.
*నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ ‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ‘నా ప్రొటోకాల్‌ మీకు తెలుసా’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారన్న ఆగ్రహంతో అర్ధరాత్రి దౌర్జాన్యానికి పాల్పడ్డారు.
*వినియోగదారుల ఆధార్‌ వివరాలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్న వ్యాపార సంస్థలకు ముకుతాడు వేసేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా అమ్మకానికి పెట్టింది.
*కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదుల్లా మారాయని, రాజకీయ ప్రత్యర్థులపై వివిధ రూపాల్లో దాడులు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసి, నాయకత్వాన్ని చంపేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉన్న తెదేపా నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
*ఓటర్ల జాబితా తయారీపై అనుసరిస్తున్న సాంకేతిక విధానమేమిటి?.. ఓటర్లను చేర్చాలన్నా.. తొలగించాలన్నా మీరు అనుసరిస్తున్న విధానమేమింటి? అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌ఓ)కు ఉన్న అధికార పరిధి ఏమిటో స్పష్టం చేయాలని ఆదేశించింది.
* దేశంలోనే అత్యధిక మిగులు ఆదాయం ఉన్న రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గుర్తింపు పొందింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి దేశంలోని 37 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన ఆదాయ వ్యయాలపై ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఏడీఆర్‌) జరిపిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడయింది.
*పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భారీ విరాళాన్ని ప్రకటించింది. రూ.4 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.విశ్వాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ జి.దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.ఎల్లారెడ్డి, ప్రచార కార్యదర్శి విష్ణువర్ధన్‌ రాజులు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిని కలిశారు. ఈ మొత్తాన్ని తమ పింఛన్‌ నుంచి జవాన్ల కుటుంబాలకు అందజేయాలంటూ ఆమోద పత్రాన్ని సమర్పించారు.
*బీటీ పత్తి విత్తనాలపై మేథోపరమైన (పేటెంట్‌) హక్కు కింద మోన్‌శాంటో కంపెనీకి రుసుంగా చెల్లించాల్సిన రూ.138.19కోట్లను రెండు వారాల్లోగా జమ చేయాలని లేదా అంత మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని బాంబే హైకోర్టు హైదరాబాద్‌కు చెందిన నూజివీడు విత్తన కంపెనీని ఆదేశించింది. ఈ పూచీకత్తు ఇచ్చేవరకు కంపెనీ స్థిరాస్తులను ఇతరులకు విక్రయించరాదని సూచించింది.
*ఆర్మీ, పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గురువారం సికింద్రాబాద్‌ మిలిటరీ స్టేషన్‌లో ‘సెక్యూరిటీ కన్వెర్జెన్స్‌ సమావేశం’ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రా సబేరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ), మేజర్‌ జనరల్‌ ఎన్‌.శ్రీనివాస్‌రావు, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిల నేతృత్వంలో జరిగిన సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*ఓట్ల తొలగింపునకు ఫారం-7 రూపేణా అందిన 1,61,005 దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేయగా అందులో 1,55,696 నకిలీవేనని గుర్తించి, తిరస్కరించామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. 5,309 ఓట్లు మాత్రమే తొలగింపునకు అర్హమైనవిగా గుర్తించామన్నారు.
*రాష్ట్రంలోని 95 మంది మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవోలు)కు డిప్యూటీ సీఈవోలు (ముఖ్య కార్యనిర్వహణ అధికారులు)గా పదోన్నతి లభించింది.
*విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు ఓఎస్డీగా ఎస్‌.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఖరారుపై ఆయన పనిచేయనున్నారు. రైల్వేలో చీఫ్‌ పర్సనల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఓఎస్డీగా నియమిస్తూ దక్షిణమధ్య రైల్వే జీఎం గజానంద్‌ మాల్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. దక్షిణమధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్లను పునర్‌విభజించి దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓఎస్డీని నియమించడంతో విభజన ప్రక్రియ మరో అడుగు ముందుకు పడినట్లయింది.
*ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం ఈ నెల 9న నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ అయ్యప్పన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌, గవర్నర్‌ నరసింహన్‌ అధ్యక్షతన స్నాతకోత్సవం జరుగుతుందని ప్రవీణ్‌రావు వెల్లడించారు.
* తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏలలో 2019-2020 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌-2019 నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారని ఐసెట్‌-2019 కన్వీనర్‌ ఆచార్య సీహెచ్‌ రాజేశం గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఛాలెంజ్‌ మెథడ్‌ కమిటీ సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో, ప్రకాశం జిల్లా కందుకూరులోనూ కేంద్రీయ విద్యాలయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
*ఏపీఎస్‌ ఆర్టీసీలో ఒప్పంద కార్మికులకు తీపికబురు. 1,213 మంది ఒప్పంద కార్మికుల ఉద్యోగాలను ఆర్టీసీ యాజమాన్యం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఎన్‌.వి.సురేంద్రబాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌లో అర్హుల ఓట్ల గల్లంతుకు కుట్ర పన్నినవారు, దానికి పాల్పడినవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది. ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ కె.సత్యనారాయణ ఈ బృందానికి సారథిగా వ్యవహరించనున్నారు.
* లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రోజుకో జిల్లాలో ఆయన పర్యటిస్తారు.
*పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 22న పోలింగ్‌ నేపథ్యంలో సెలవు ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
*ఆంధ్రప్రదేశ్‌లో అధికార ప్రతిపక్షాలు చేస్తున్న సమాచార దొంగతనం, ఓట్ల తొలగింపు ఆరోపణల సమస్యను ఎన్నికలకు ముందే పరిష్కరించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె లేఖ రాశారు.
*కుప్పం కాలువలోకి తొలి ఎత్తిపోతల ద్వారా విడుదల చేసిన నీరు కొన్ని అక్విడక్టులు, టన్నెళ్లు దాటి దాదాపు 30 కిలోమీటర్ల వరకు చేరింది.
*అమరావతిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 వేల మంది వర్కింగ్‌ జర్నలిస్టులకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
*ఏపీ ట్రాన్స్‌కో వాణిజ్య, మానవ వనరులు, ఐటీ విభాగాలకు సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌(జేఎండీ)గా విజిలెన్స్‌కు చెందిన పి.ఉమాపతికి అదనపు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జేఎండీగా ఉన్న దినేష్‌ పరుచూరి మాతృసంస్థ అయిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు వెళ్లడంతో విజిలెన్స్‌ జేఎండీ పి.ఉమాపతికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
*నేలపాడు వద్ద నిర్మించిన హైకోర్టులో ఈ నెల 18 నుంచి విధులు ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఏపీ హైకోర్టు విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయ ప్రాంగణంలో పనిచేస్తోంది.
*గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను నెల రోజులు, మెయిన్స్‌ పరీక్షను 45 రోజులు వాయిదా వేయాలని, వయో పరిమితి పెంచాలని గ్రూప్‌-1 అభ్యర్థులు, నిరుద్యోగ జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు గురువారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఎదుట ఆందోళన నిర్వహించారు.
*గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు గోరంట్ల హోసన్నా మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 42వ గుడారాల పండగ కూటాలు గురువారం ప్రారంభమయ్యాయి.
*రాష్ట్రంలో 487 కాపు సామాజిక భవన నిర్మాణాల పనులు చురుగ్గా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ తెలిపింది. వీటి నిర్మాణాలకు రూ.146.15 కోట్ల వరకు వ్యయం అవుతుందని కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోట్ల శివశంకరరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 129 నిర్మాణాలకు స్థల సేకరణ జరగాల్సి ఉందని, 284 నిర్మాణాల పనులు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 117, విశాఖపట్టణం జిల్లాలో 110, పశ్చిమగోదావరి జిల్లా-59, అనంతపురం జిల్లా-44, గుంటూరు జిల్లా-40, ప్రకాశం జిల్లా-29, విజయనగరం జిల్లా-24, నెల్లూరు జిల్లా-15, కడప జిల్లా-9, కర్నూలు జిల్లా-8, చిత్తూరు జిల్లా-4, శ్రీకాకుళం జిల్లాలో మూడు వంతున నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది.
*ప్రజాపంపిణీపై రేషన్‌కార్డుదారుల్లో సంతృప్తస్థాయిని 90 నుంచి 95 శాతం వరకు పెంచేలా ఈ నెల 15నుంచి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు రేషన్‌డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డీలర్లకు కమీషన్‌ పెంచడంతోపాటు, డీలర్లు ఎవరైనా మృతి చెందితే మట్టి ఖర్చులకు రూ.15వేలు ఇస్తామని, డీలర్లందరినీ చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలపై డీలర్లంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
*రాష్ట్రంలో 34 మంది న్యాయవాదుల నోటరీ సేవలను ఐదేళ్లపాటు కొనసాగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణ్ణా, గుంటూరు, నెల్లూరు ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు వీరిలో ఉన్నారు.
*రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా చిత్తూరు జిల్లాకు చెందిన సైకం జయచంద్రారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ పదవిరీత్యా కార్యదర్శి డి.వరప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంస్థ ఛైర్మన్‌ పదవికి చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
*తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏలలో 2019-2020 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌-2019 నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారని ఐసెట్‌-2019 కన్వీనర్‌ ఆచార్య సీహెచ్‌ రాజేశం గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఛాలెంజ్‌ మెథడ్‌ కమిటీ సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో, ప్రకాశం జిల్లా కందుకూరులోనూ కేంద్రీయ విద్యాలయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
*జర్మనీలోని బెర్లిన్‌లో జరుగుతున్న బాక్సింగ్‌ శిక్షణ శిబిరం టోర్నీలో భారత సూపర్‌స్టార్‌ మేరీకోమ్‌ అజేయ ప్రదర్శన చేసింది. 51 కేజీల్లో తలపడిన మేరీ వరుసగా మూడు బౌట్లు గెలిచింది. తొలి బౌట్లో డారియా (ఉక్రెయిన్‌)ను ఓడించిన మేరీ.. రెండో బౌట్లో ఉర్సులా (జర్మనీ), మూడో బౌట్లో వెరొనికా లొస్‌విక్‌ (నార్వే)పై విజయాలు సాధించింది. ఈ బౌట్లన్నింటిని ఆమె 5-0తో గెలుచుకోవడం విశేషం. సాధారణంగా మేరీ బరువు విభాగం 48 కేజీలు కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ విభాగం లేకపోవడంతో ఆమె 51 కేజీలకు మారింది.
*ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే 0-2తో కోల్పోయింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేసింది. 24/0తో ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించిన భారత్‌.. తర్వాత ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
*వాహనాలన్నా, డ్రైవింగ్‌ అన్నా ధోనీకి ఉన్న ఇష్టం తెలియనిది కాదు. తాజాగా సహచరుల కోసం అతడు డ్రైవర్‌గా మారాడు. మూడో వన్డే కోసం భారత జట్టు రాంచి వెళ్లగా.. ధోని కొంత మంది ఆటగాళ్లను విమానాశ్రయం నుంచి తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం రాత్రి భారత ఆటగాళ్లందరికీ ధోని తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. ‘‘మహి భాయ్‌ ఇంట్లో చాలా సరదాగా గడిపాం. మంచి విందు ఆరగించాం. సరదా కబుర్లు చెప్పుకున్నాం’’ అని కోహ్లి ట్విట్టర్లో చెప్పాడు. ‘‘సాక్షి వదిన మా ఫిట్‌నెస్‌ను దెబ్బతీసింది. ఏదేమైనా విందును ఆస్వాదించాం’’ అని రిషబ్‌ పంత్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు.
*ఐటీ రిటన్స్‌ దాఖలు చేయలేదని డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వికి న్యాయస్థానం అరెస్టువారెంట్‌ జారీ చేసింది. కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కుమార్తె అంజుగసెల్వి 2009-10వ ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ రిటన్స్‌ దాఖలు చేయక పోవడంతో చెన్నై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆమెకు వ్యతిరేకంగా ఎగ్మూర్‌లోని అడిషనల్‌ చీఫ్‌ మ్యాజిస్ర్టేట్‌ కోర్డులో కేసు వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వలర్మతి బెయిల్‌పై విడుదల కాని విధంగా అంజుగసెల్వికి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.
* ఉద్యోగులు పని చేయని కాలానికి వేతనాలు కోరడం భావ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60కి పెంచిన అనంతరం పలు కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన సుమారు 750 మంది ఉద్యోగులు తమకు న్యాయం జరగలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కార్పొరేషన్లు, సంస్థల్లోనూ పదవీవిరమణ వయసు 58 నుంచి 60కి పెంచినప్పటికీ ప్రోత్సాహకాలు, బకాయిలు, వేతనాలు విషయంలో అన్యాయం జరిగిందని పలువురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను సుప్రీంకోర్టులోని పలు ధర్మాసనాలు విచారించాయి.
*ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఎవరూ నిరుత్సాహ పడవద్దని ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు ఓడిపోయి ఈదేశానికి ప్రధానమంత్రి అయ్యారని, ఎన్టీఆర్ ఓడిపోయారు తరువాత రాష్టానికి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గా గిరిజన నాయకుడుఅయిన శంకర్ నాయక్ ను ఎన్నుకొన్న సందర్భంగా అభినందన సభను నిర్వహించారు….ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ clp నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ …నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా గిరిజన నాయకుడైన శంకర్ నాయక్ ను నియమించడం పట్లహర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేసి అత్యధిక ఎంపి స్థానాలు గెలిపించుకోవలని అన్నారు.జానారెడ్డి మాట్లాడుతూ…రాబోయే రోజుల్లో trs కు ప్రజలు బుద్ది చెప్పే రోజులు రానున్నాయని రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. Dcc నాయకుడు శంకర్ నాయక్ కు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మోడీతో మీటింగ్ అయ్యాక

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ గురువారం చివరిసారిగా సమావేశం కానుంది.

ఈ కేబినెట్‌ భేటీలో భారీ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.

అయితే, ప్రతీ శుక్రవారం ఎన్నికల సంఘం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం సంప్రదాయం.

ఆ సంప్రదాయం ప్రకారం శుక్రవారం త్రిసభ్య ఎన్నికల సంఘం సమావేశమై లోక్‌సభతో పాటు ఏపీ, జమ్మూ కశ్మీర్‌, ఒరిస్సా, మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

అయితే, శుక్రవారమే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందా?

శని, ఆదివారాల వరకు వేచిచూడాల్సి వస్తుందా? అనే విషయంలో స్పష్టత రాలేదు.

ప్రధాని మోదీ శనివారం యూపీ, బిహార్‌లలో పలు శంకుస్థాపనల్లో పాల్గొంటారని,

ఆ సందర్భంగా తన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఘనంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

అప్పటిదాకా ఎన్నికల సంఘం ఆగుతుందా?

అనేది చూడాల్సి ఉంది. ప్రధాని కోసం ఈసీ ఆగితే షెడ్యూల్‌ ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉంది.

2014లో మార్చి 5న షెడ్యూల్‌ ప్రకటన వెలువడగా,

25 రోజుల తర్వాత తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 7న జరిగింది.

ఇప్పటికే ఎన్నికల తేదీల ప్రకటన ఆలస్యం అయినందున పదో తేదీన ప్రకటన వెలువడితే తొలిదశ పోలింగ్‌కు 25 రోజుల వ్యవధి ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లా ఈసారి తొమ్మిది దశల పోలింగ్‌ పోలింగ్‌ జరిగేదీ అనుమానమేనని అంటున్నారు

ఎంజీఆర్ రైల్వే స్టేషన్ అని పేరు పెడతా

చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ పేరు మార్చుతామని, దానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులోని తమ మిత్రపక్షాలతో కలిసి ఓ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు ఎంజీ రామచంద్రన్‌ పేరు పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. అలాగే, తమిళనాడుకు వచ్చే విమానాల కోసం, అదే విధంగా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల సమాచారాన్ని తెలపడం కోసం విమానాశ్రయాల్లో తమిళంలోనూ ప్రకటనలు చేయించాలని మేము భావిస్తున్నాం. అప్పట్లో ప్రజలు ఎంజీఆర్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, కేంద్రంలోని కాంగ్రెస్.. ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయించింది. ఆర్టికల్‌ 356ను కాంగ్రెస్‌ చాలాసార్లు దుర్వినియోగం చేసింది. తమకు ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను ఆ పార్టీ రద్దు చేయిస్తుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన హయాంలో మొత్తం 50 ప్రభుత్వాలను రద్దు చేయించారు. ఈ తీరుకి డీఎంకే కూడా ఓ సారి‌ బాధిత పార్టీ అయింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్‌తో అవకాశవాద రాజకీయాలు చేస్తోంది. తమిళనాడు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది’ అని తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీల నేతలకు నాపై ఉన్న ద్వేషం కొత్త పుంతలు తొక్కుతోంది. నన్ను విమర్శించడంలో పోటీ పడుతున్నారు. కొందరు నా కుటుంబంపై చెడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు నేను అనుభవించిన పేదరికంపై మాట్లాడుతున్నారు. నన్ను తొలగించడానికి ఆ కల్తీ కూటమి ప్రయత్నిస్తోంది. అవినీతిపై ఎన్డీఏ రాజీలేని పోరాటం చేస్తోంది. దేశ భద్రత విషయంలో శక్తిమంతంగా పని చేస్తోంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించట్లేదు. ప్రజలే మా అధిష్ఠానం. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ అవమానపరుస్తుంది. కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. వారికి శక్తిమంతమైన భారత్, రక్షణ వ్యవస్థ అవసరం లేదు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

సరిహద్దు గ్రామాల్లో పాక్ కాల్పులు

జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల‌ ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్ ఆర్మీని తాము హెచ్చరించామని భారత ఆర్మీ బుధవారం మీడియాకు తెలిపింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోనూ జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాక్‌ ఆర్మీ తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఈ విషయంపై స్పందించిన భారత ఆర్మీ… ‘ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవద్దని మేము పాకిస్థాన్‌ను హెచ్చరించిన తర్వాత సరిహద్దు నియంత్రణ రేఖ ప్రాంతాల్లో ప్రస్తుతం తాత్కాలికంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. 24 గంటలుగా పాకిస్థాన్..‌ కృష్ణాఘాటి, సుందర్‌బానీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది’ అని తెలిపింది. ‘పాకిస్థాన్‌ ఆర్మీ పాల్పడుతున్న ఈ చర్యలను భారత ఆర్మీ తిప్పికొడుతోంది. మన ఆర్మీలో ప్రాణనష్టం సంభవించలేదు. పౌరులకు ఎటువంటి గాయాలు కాకూడదనే నిబద్ధతతో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా నియంత్రణ రేఖ ప్రాంతాలపై దృష్టి పెట్టాం. మరోవైపు మన భద్రతా బలగాలు ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని పనిచేస్తున్నారు. వారికి లభిస్తున్న మౌలిక సదుపాయాలపై కూడా దృష్టిపెట్టారు’ అని ఆర్మీ మీడియాకు తెలిపింది. కాగా, కొన్ని రోజులుగా పాక్‌ ఆర్మీ పదేపదే కాల్పులకు తెగబడుతోంది. రాజౌరీ, నౌషెరా, కృష్ణాఘాట్‌ ప్రాంతాల్లో పౌరులు, ఆర్మీ గస్తీ శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది.

నోట్ల రద్దుతో కోటి ఉద్యోగాలు మాయం

భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల(ఫిబ్రవరి -2019)లో దీని రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లలో సర్వే చేసి ఈ నివేదికను సీఎంఐఈ వెల్లడించింది. ఉద్యోగార్థుల సంఖ్య తగ్గినప్పటికీ.. నిరుద్యోగ రేటు పెరిగిందని ముంబయికి చెందిన ఓ సంస్థకు హెడ్‌ అయిన మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య ఫిబ్రవరిలో 400 మిలియన్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇది గతేడాది 406 మిలియన్లుగా ఉందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 2018లో దాదాపు 1.10కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ గణాంకాలు త్వరలో ఎన్నికలకు సిద్ధం కానున్న ప్రధాని నరేంద్రమోదీకి నిరాశ కలిగించే విధంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

ఆయనకు సోషల్ మీడియాలో ఖాతాలు లేవు. అందుకే ఆయన దేశం మెచ్చిన వీరుడు.

అభినందన్‌ వర్థమాన్‌.. మొన్నటి వరకు భారత వాయుసేనలో ఓ పైలట్ మాత్రమే. మరి ఇప్పుడు.. ఆయన హీరో. పాక్‌ చేతికి చిక్కి మళ్లీ భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆయనకు వచ్చిన ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఎంతంటే ఆయన గుబురు మీసాలను కూడా అనుసరించేంత. ఆయనను సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించేందుకు ఎగబడేంత. ఈ క్రమంలో కొందరు ఫేక్‌గాళ్లు అతడి పేరిట నకిలీ ఖాతాలు సృష్టించారు. దీంతో ఏది నకిలీ ఖాతానో.. ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపై తాజాగా భారత వాయుసేన స్పష్టతనిచ్చింది. అసలు ఆయనికి సోషల్‌మీడియా(ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌)లో ఖాతాలే లేవని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ట్వీట్‌ చేసింది. అభినందన్‌ పేరిట చలామణీ అవుతున్న కొన్ని ఖాతాల జాబితాను పేర్కొంటూ.. ఆ ఖాతాలను అనుసరించొద్దని సూచించింది. పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక పోరులో ప్రమాదవశాత్తూ అభినందన్‌ పాక్‌లో దిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని అక్కడి ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అతడు తిరిగి రావాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రార్థనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు తిరిగి అప్పగించింది. ఆ సమయంలో ఆయన కోసం శోధించనివాళ్లు.. ఆయన కుటుంబం కోసం తెలుసుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. మరికొందరు అభినందన్‌ సామాజిక వర్గం కోసం కూడా శోధించడం శోచనీయం.